Page Loader
Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌
ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌

Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత టెస్టు జట్టులో స్థిరమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో భారత బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ పట్టుదలతో ముందుకెళ్తున్నాడు. తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా తీసుకుని, దానిపై పూర్తిగా దృష్టి సారించాడు. ఇంగ్లాండ్‌ పర్యటించే భారత 'ఎ' జట్టులో ఎంపికైన అతడు, ఇప్పటికే తన బరువులో గణనీయంగా మార్పు తెచ్చాడు. ప్రత్యేకమైన ఆహార నియమాలతో దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. సర్ఫరాజ్‌ ప్రస్తుతం ఉడకబెట్టిన కూరగాయలు, చికెన్‌ మాత్రమే తింటున్నాడు. ఫిట్‌నెస్‌లో మరింత మెరుగుదల సాధించాలని సంకల్పించుకున్నాడు. తన ఆటతీరు మెరుగుపరచడంపైనా సమగ్ర దృష్టి పెట్టాడు. ముఖ్యంగా ఆఫ్‌సైడ్‌ బంతులపై తన శక్తిని కేంద్రీకరించాడు. తండ్రి నౌషద్‌ ఖాన్‌ పర్యవేక్షణలో ప్రత్యేక సాధన చేస్తూ ఆఫ్సైడ్‌లో బంతులను తేలికగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు.

Details

గాయం కారణంగా రంజీ ట్రోఫీకి దూరం

ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా ఆడి 150 పరుగులు చేసిన సర్ఫరాజ్‌.. తదుపరి రెండు టెస్టుల్లో మాత్రం నిరాశపరిచాడు. అయితే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ కోసం భారత జట్టులోకి ఎంపికైనా.. ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయం వల్ల పక్కటెముకలు దెబ్బతినడంతో దూరమయ్యాడు. ఈ గాయం కారణంగా రంజీ ట్రోఫీలో కూడా పాల్గొనలేకపోయాడు. తదుపరి ఐపీఎల్‌లో కూడా అతనికి ఎలాంటి అవకాశం దక్కలేదు. ఏ జట్టు కూడా అతన్ని ఎంపిక చేయలేదు. అయినా ఫిట్‌నెస్‌, ఆటతీరు మెరుగుపరచేందుకు సర్ఫరాజ్‌ చేస్తున్న కృషి అతడి లక్ష్యాన్ని చేరువ చేయగలదని అభిమానులు ఆశిస్తున్నారు.