BAN Vs SL : 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విచిత్రకర రీతిలో ఔటైన శ్రీలంక ప్లేయర్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ దిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో శ్రీలంక సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ విచిత్రకర రీతిలో ఔట్ అయ్యాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ బాట పట్టాడు. మాథ్యూస్ క్రీజులోకి ఆలస్యంగా రావడంతో అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ ఆటగాడు ఇలా 'టైమెడ్ ఔట్' అవడం ఇదే తొలిసారి. శ్రీలంక ఇన్నింగ్స్ 24వ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో రెండో బంతికి సమరవిక్రమ ఔట్ అయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ హెల్మెట్ తీసుకురాలేదు. క్రీజులో గార్డ్ తీసుకొనే సమయంలో తన హెల్మెట్ బాగోలేదని గమనించాడు.
అప్పీలు చేసిన బంగ్లా కెప్టెన్
వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు కొత్త హెల్మెట్ కోసం మాథ్యూస్ సైగలు చేశాడు. ఇక సబ్‌స్ట్యూట్ కరణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి మాథ్యూస్‌కు హెల్మెట్ ఇచ్చాడు. ఇదంతా జరగడానికి మూడు నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్డ్ అవుట్ అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఓ బ్యాటర్ ఔట్/రిటైర్మెంట్ అయ్యాక.. తదుపరి వచ్చే బ్యాటర్ మూడు నిమిషాల్లోగా తర్వాతి బంతిని ఎదుర్కొవాలి. లేదా ఆ టైమ్‍లోగా అవతలి ఎండ్‍లో ఉన్న బ్యాటర్ అయినా బంతిని ఆడాలి. లేకపోతే కొత్తగా వచ్చిన బ్యాటర్‌ను ఔట్‍గా ప్రకటించే అవకాశం ఉంది.