Page Loader
David Valentine Lawrence: 61 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన మాజీ పేస్‌ బౌలర్ డేవిడ్ 'సిడ్' లారెన్స్
61 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన మాజీ పేస్‌ బౌలర్ డేవిడ్ 'సిడ్' లారెన్స్

David Valentine Lawrence: 61 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన మాజీ పేస్‌ బౌలర్ డేవిడ్ 'సిడ్' లారెన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2025
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ మైదానంలోనే కాకుండా జీవితంలోనూ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ పేస్‌ బౌలర్ డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ (David Valentine Lawrence) 61 ఏళ్ల వయసులో మోటార్ న్యూరోన్ డిసీజ్‌ (MND) అనే తీవ్రమైన నరాల వ్యాధితో పోరాడి కన్నుమూశారు. ఇంగ్లండ్ అభిమానుల మధ్య 'సిడ్' అనే పేరుతో ప్రసిద్ధుడైన లారెన్స్, 1988లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి 1992 వరకు మొత్తం 5 టెస్టులాడారు. ఈ మ్యాచ్‌లలో 18 వికెట్లు తీశారు. ముఖ్యంగా 1991లో ది ఓవల్‌ మైదానంలో వెస్టిండీస్‌పై 5 వికెట్ల ఘనత సాధించారు. 1992లో వెలింగ్టన్‌ టెస్టులో మోకాలి తీవ్రగాయం కావడంతో ఆయన అంతర్జాతీయ కెరీర్‌ అర్థాంతరంగా ముగిసింది.

Details

అధికారికంగా ప్రకటించిన గ్లోస్టర్‌షైర్‌ కౌంటీ క్రికెట్ క్లబ్‌

2023లో డేవిడ్ లారెన్స్‌కి MND (Motor Neurone Disease) అనే తీవ్రమైన నరాల వ్యాధి నిర్ధారణ అయింది. ఈ వ్యాధి ఆయన కండరాలపై ప్రభావం చూపింది. చివరికి దీని కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. గ్లోస్టర్‌షైర్‌ కౌంటీ క్రికెట్ క్లబ్‌ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తీవ్ర విషాదంతో డేవ్ లారెన్స్‌ మరణాన్ని ప్రకటిస్తున్నాం. మైదానంలోనూ, జీవితంలోనూ ఆయన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. చివరి శ్వాస వరకు ధైర్యంగా ఈ వ్యాధిని ఎదుర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్షణంలో పక్కనే ఉన్నారని తెలిపింది. 1964 జనవరి 28న జన్మించిన డేవిడ్ 'సిడ్' లారెన్స్‌, కేవలం 17 ఏళ్లకే గ్లోస్టర్‌షైర్‌ తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.

Details

477 వికెట్లు పడగొట్టిన  పేసర్

గ్లోస్టర్‌షైర్‌ తరపున 170 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో పాల్గొని మొత్తం 477 వికెట్లు తీశారు. ఇందులో 7/47 ఆయన కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకం.అలాగే 110 వన్డే మ్యాచ్‌లు ఆడి 148 వికెట్లు సాధించారు. రిటైర్మెంట్‌ తరువాత గ్లోస్టర్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. డేవిడ్‌ లారెన్స్‌ మృతిపై ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ECB) ఛైర్మన్‌ రిచర్డ్‌ థాంప్సన్‌ స్పందిస్తూ, "డేవిడ్ 'సిడ్' లారెన్స్‌ క్రికెట్‌ ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శం. ధైర్యం కలిగిన ఫాస్ట్‌ బౌలర్‌గా ఆయన అభిమానులను ఉర్రూతలూగించడమే కాకుండా, నాయకుడిగా కూడా మార్పుకు దోహదపడ్డారు. ఆయన చేసిన సేవలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, క్రికెట్‌ సమాజానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలుపుతున్నామని అన్నారు.