LOADING...
Shri Charani: అథ్లెటిక్స్‌ నుంచి క్రికెట్‌ దాకా.. వరల్డ్‌ కప్‌లో మెరిసిన కడప అమ్మాయి!
అథ్లెటిక్స్‌ నుంచి క్రికెట్‌ దాకా.. వరల్డ్‌ కప్‌లో మెరిసిన కడప అమ్మాయి!

Shri Charani: అథ్లెటిక్స్‌ నుంచి క్రికెట్‌ దాకా.. వరల్డ్‌ కప్‌లో మెరిసిన కడప అమ్మాయి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌ను మొదటిసారిగా తమ సొంతం చేసుకుంది. "ఈ క్షణం కోసం మేమంతా ఎంతోకాలం ఎదురుచూశాం. ఇప్పుడు ఆ కల సాకారమైంది. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను. నా జట్టుపై నాకు అపారమైన గర్వం ఉందని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఆనందభాష్పాలతో పేర్కొన్నారు.

Details

 టాప్ బౌలర్లలో చోటు దక్కించుకున్న శ్రీ చరణి

ఈ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో కడప యువ క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీ చరణి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్ల జాబితాలో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. శ్రీ చరణి మొత్తం 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి ఈ జాబితాలో చోటు సంపాదించింది. తొలి స్థానంలో దీప్తి శర్మ ఉన్నా, ఆమె తర్వాత నిలిచిన రెండో భారతీయ బౌలర్‌గా శ్రీ చరణి నిలిచింది. ఫైనల్‌లో కూడా శ్రీ చరణి కీలకమైన వికెట్‌ను అందించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఆనికే బోష్‌ను డకౌట్ చేస్తూ భారత్‌కు బలమైన ఆధిక్యం తీసుకువచ్చింది.

Details

 కీలక వికెట్ తీసిన శ్రీ చరణి

భారత్ విధించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు ఆచితూచి ఆడుతుండగా, 51 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తజ్మిన్ బ్రిట్స్‌ను అమన్‌జోత్ రనౌట్ చేయగా, వెంటనే ఆనికేను ఖాతా తెరవకుండానే శ్రీ చరణి ఔట్ చేయడం మ్యాచ్‌లో కీలక మలుపుగా మారింది.

Advertisement

Details

కడప నుంచి కప్ దాకా శ్రీ చరణి ప్రయాణం

2004 ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో జన్మించిన నల్లపురెడ్డి శ్రీ చరణి లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్‌గా, ఎడమచేతి బ్యాటర్‌గా పేరు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఆమెకు మావయ్య ప్రోత్సాహమే క్రికెట్‌లో ముందుకు రావడానికి బలంగా నిలిచింది.అండర్-19జట్టుకు చోటు దక్కకపోయినా, అండర్-23 స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో ముంబై ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ఆమె కోసం పోటీ పడ్డాయి. చివరికి రూ.55 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్‌ ఆమెను తమ జట్టులోకి తీసుకుంది. ఆమె ఆరంగేట్ర మ్యాచ్‌ రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఆడింది. ఆ మ్యాచ్‌లోనే కీలక వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచింది.

Advertisement

Details

నాన్న ఏడ్చేశాడు.. శ్రీ చరణి భావోద్వేగం

తన మావయ్య కారణంగానే క్రికెట్‌ ఆడడం ప్రారంభించానని శ్రీ చరణి వెల్లడించింది. ఆరవ తరగతిలో ఉన్నప్పుడు నాన్న బ్యాడ్మింటన్‌లో చేర్చారు. ఇంటికి వచ్చి మళ్లీ క్రికెట్ ఆడేదాన్ని. ప్రొద్దుటూరు అకాడమీలో చేరాక, కోచింగ్ ముగిసినా ఇంటికి వచ్చి ఆడుతూనే ఉండేదాన్ని. కోచ్‌లకు నాన్న ఫిర్యాదు చేసేవారని ఆమె నవ్వుతూ గుర్తుచేసుకుంది. నాన్న మొదట్లో క్రికెట్ ఆడటానికి ఒప్పుకోలేదు. కానీ ఏడాది తర్వాత నా కృషి చూసి ఒప్పుకున్నారు. డబ్ల్యూపీఎల్ వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌కు ఎంపికైనప్పుడు నాన్న ఆనందంతో ఏడ్చేశారని ఓ ఇంటర్వ్యూలో శ్రీ చరణి చెప్పింది. అలాగే స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్‌ల ఆట తీరును తన మావయ్య వివరించేవారని ఆమె గుర్తుచేసుకుంది.

Details

టీమిండియా దృష్టిలో పడిన క్షణం

శ్రీ చరణి ప్రతిభను టీమిండియా మొదటగా గమనించిన సందర్భం గురించి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్వయంగా చెప్పింది. 2025 డబ్ల్యూపీఎల్‌లో ఆమె రెండు మ్యాచ్‌ల్లో నాలుగు కీలక వికెట్లు తీసింది. అప్పుడే మేము ఆమెను గమనించాము. ఆమె మాకు బలమైన ఆప్షన్ అవుతుందని సెలక్టర్లతో చర్చించామని హర్మన్‌ పేర్కొంది. ఈ విజయంతో శ్రీ చరణి పేరు దేశమంతా మార్మోగుతోంది. కడప నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు ప్రపంచ కప్‌ కప్‌ దాకా చేరింది. ఇది ఆమె కృషి, పట్టుదల, త్యాగానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.

Advertisement