LOADING...
Year Ender 2025: క్రికెట్‌ నుంచి చెస్‌ వరకూ.. భారత యువత సాధించిన అద్భుత విజయాలపై ఓ లుక్కేయండి!
క్రికెట్‌ నుంచి చెస్‌ వరకూ.. భారత యువత సాధించిన అద్భుత విజయాలపై ఓ లుక్కేయండి!

Year Ender 2025: క్రికెట్‌ నుంచి చెస్‌ వరకూ.. భారత యువత సాధించిన అద్భుత విజయాలపై ఓ లుక్కేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రీడా రంగంలో 2025 ఏడాది యువ ఆటగాళ్లదే అనిపించింది. క్రికెట్ నుంచి చెస్‌, షూటింగ్‌ వరకు అనేక క్రీడల్లో యువ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనలతో దేశ గర్వాన్ని పెంచారు. ఐపీఎల్‌-2025లో 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రే సంచలన ఆటతీరుతో వార్తల్లో నిలవగా.. చెస్‌లో దివ్య దేశ్‌ముఖ్‌ మహిళల వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 2025లో భారత యువ ఆటగాళ్లు సాధించిన ఘన విజయాలను ఓసారి నెమరు వేసుకుందాం.

Details

దూసుకొచ్చిన యువ కెరటం - వైభవ్‌ సూర్యవంశీ 

భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా వైభవ్‌ సూర్యవంశీ నిలిచాడు. హర్యానాకు చెందిన ఈ 14 ఏళ్ల యువకుడు రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన పోరులో కేవలం 38 బంతుల్లో 101 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో అత్యంత పిన్న వయసులో ఐపీఎల్‌ శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా కూడా నిలిచాడు. అనంతరం భారత అండర్‌-19 జట్టు తరఫున యూత్‌ వన్డేలు, టెస్టుల్లోనూ సెంచరీలతో అదరగొట్టాడు.

Details

ఆయుశ్‌ మాత్రే

మహారాష్ట్రకు చెందిన ఆయుశ్‌ మాత్రే ఈ ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 28 పరుగులు బాదుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 94 పరుగులు చేసి శతకానికి తృటిలో దూరమయ్యాడు. వైభవ్‌తో కలిసి భారత అండర్‌-19 జట్టుకు ఓపెనింగ్‌ చేస్తున్న ఆయుశ్‌, అదే సమయంలో కెప్టెన్‌గా కూడా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ ప్రశంసలు అందుకున్నాడు.

Advertisement

Details

దివ్య దేశ్‌ముఖ్

భారత చెస్‌లో మరో సరికొత్త సంచలనం దివ్య దేశ్‌ముఖ్‌. ఫిడే మహిళల వరల్డ్‌కప్‌-2025లో ఈ మహారాష్ట్ర యువతి అద్భుత విజయం సాధించింది. ఫైనల్లో సీనియర్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపిని ఓడించి టైటిల్‌ కైవసం చేసుకుంది. దీంతో కేవలం 19 ఏళ్ల వయసులోనే వరల్డ్‌కప్‌ గెలిచిన అత్యంత పిన్న చెస్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందకముందే ఈ ఘనత సాధించిన అరుదైన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. వరల్డ్‌కప్‌ విజయంతోనే దివ్యకు గ్రాండ్‌మాస్టర్‌ హోదా లభించింది. ఆమె ఓవరాల్‌గా భారత్‌లో 88వ, మహిళల్లో 44వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచింది. అలాగే ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌-2026కు అర్హత సాధించింది.

Advertisement

Details

డి. గుకేశ్

గతేడాది వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌ ఈ ఏడాది కూడా సత్తా చాటాడు. ఫిడే గ్రాండ్‌ స్విస్‌-2025లో విజయం సాధించడమే కాకుండా, తన కెరీర్‌లో తొలిసారిగా ఫిడే క్లాసికల్‌ రేటింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌-3 స్థానానికి చేరాడు.

Details

 ఆర్‌. ప్రజ్ఞానంద, వైశాలి రమేశ్‌బాబు

చెన్నైకి చెందిన అక్కాతమ్ముళ్లు ప్రజ్ఞానంద, వైశాలి రమేశ్‌బాబు ఈ ఏడాది కూడా తమ హవాను కొనసాగించారు. ప్రజ్ఞానంద టాటా స్టీల్‌ చెస్‌-2025లో టై బ్రేకర్‌లో గుకేశ్‌ను ఓడించి టైటిల్‌ గెలుచుకున్నాడు. దీంతో ఫిడే రేటింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌-8 ర్యాంక్‌ను సాధించాడు. వైశాలి రమేశ్‌బాబు వరుసగా రెండో ఏడాది ఫిడే గ్రాండ్‌ స్విస్‌-2025టైటిల్‌ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా చెస్‌ ప్లేయర్‌గా నిలిచింది. ఈప్రదర్శనతో ఆమె వుమెన్స్‌ క్యాండిడేట్స్‌కు అర్హత సాధించింది. ఆమెకంటే ముందు హంపి, దివ్య ఈ టోర్నీకి క్వాలిఫై అయ్యారు. టాటా స్టీల్‌ చాలెంజర్స్‌లోనూ మెరిసిన వైశాలి మహిళల రేటింగ్స్‌లో ఇండియా నంబర్‌-2గా నిలిచింది. తెలంగాణకు చెందిన అర్జున్‌ ఇరిగేసి కూడా ఈఏడాది స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Details

మరెన్నో విజయాలు

ఫ్రీస్టైల్‌ చెస్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించి నాకౌట్‌కు చేరిన అర్జున్‌ ఇరిగేసి, రాపిడ్‌ రౌండ్‌ రాబిన్‌ దశలోనూ కార్ల్‌సన్‌కు ఓటమిని రుచి చూపించాడు. అయితే క్వార్టర్‌ ఫైనల్స్‌లో విన్సెంట్‌ కెమెర్‌ చేతిలో ఓడిపోవడంతో సెమీస్‌ అవకాశాన్ని కోల్పోయాడు. ఇక పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి వరల్డ్‌ ఆర్చరీ పారా చాంపియన్‌షిప్స్‌ టైటిల్‌ గెలుచుకుంది. షూటర్‌ సామ్రాట్‌ రాణా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ విభాగంలో విజయం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

Details

 తొలిసారిగా మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలుపు

పారా అథ్లెట్‌ సుమిత్‌ ఆంటిల్‌, అథ్లెట్‌ అనిమేశ్‌ కుజూర్‌ కూడా ఈ ఏడాది చెప్పుకోదగ్గ విజయాలు సాధించారు. టీమ్‌ ఈవెంట్లలో భారత్‌ తొలిసారిగా మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలిచింది. ఖో-ఖోలో పురుషులు, మహిళలు.. కబడ్డీలో పురుషులు, మహిళల జట్లు చాంపియన్లుగా నిలిచాయి. మహిళల అంధుల క్రికెట్‌ జట్టు కూడా టీ20 వరల్డ్‌కప్‌ గెలిచి భారత క్రీడా వైభవాన్ని ప్రపంచానికి చాటింది.

Advertisement