AUS vs IND: గబ్బా పిచ్ రిపోర్ట్.. మూడో టెస్టు కోసం క్యురేటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో మూడో టెస్టు బ్రిస్బేన్‌లోని ప్రసిద్ధ గబ్బా మైదానంలో జరుగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1 సమంతో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయం ఎవరిదైతే వారు ఆధిక్యంలోకి దూసుకెళ్తారు. గత పర్యటనలో టీమిండియా గబ్బాలో అద్భుత విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది. గబ్బా పిచ్ పేసర్లకు స్వర్గధామంగా పేరుపొందింది. ఈసారి పిచ్ ఎలా ఉంటుంది, ఎవరి కోసం అనుకూలంగా మారుతుంది అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో గబ్బా క్యురేటర్ డేవిడ్ సందుర్స్కి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరిగానే సంప్రదాయ బౌన్సీ పిచ్‌ను రూపొందిస్తున్నామని, ఇది పేసర్లకు సహకరించే ఈ పిచ్ బ్యాటర్లకు కూడా అవకాశాలను కల్పిస్తుందన్నారు.
పిచ్ ను సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోంది
పాత పిచ్‌లకు, కొత్త పిచ్‌లకు కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చని, కానీ ఎటువంటి అదనపు మార్పులు చేయలేదన్నారు. ఇప్పటికీ పిచ్ సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా జట్టు టాప్ ఆర్డర్‌లో స్థిరత లేకపోవడం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు చేయకపోవడం జట్టుకు ఒత్తిడిని పెంచుతోందన్నారు. ట్రావిస్ హెడ్ మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడినా, అతనికి మిగతా బ్యాటర్ల మద్దతు అవసరమన్నారు. జట్టు విజయం సాధించాలంటే టాప్ - 6 బ్యాటర్లు ప్రతిభను ప్రదర్శించాలన్నారు.
ఉస్మాన్ ఖవాజాకు మద్దతు ఇవ్వాలి
ఉస్మాన్ ఖవాజా వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లకు మద్దతు ఇవ్వాలని, అవసరమైతే యువ ఆటగాడు సామ్ కొన్సాటాస్‌ను జట్టులోకి తీసుకోవాలని వార్నర్ సూచించారు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకారం, తొలి రోజు టికెట్లు ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. గబ్బా పిచ్, ఇరు జట్ల ప్రదర్శన గురించి క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు గబ్బాలో మరో అద్భుత ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ కీలక పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి!