Team India: రోహిత్-కోహ్లీలతో గంభీర్ విభేదాలు? డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం దెబ్బతింటోందా!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. కోహ్లీ శతకంతో మెరిసితే, రోహిత్ కీలకమైన అర్థశతకంతో జట్టుకు బలాన్నిచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత విజయంలో వీరిద్దరి పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే ఇద్దరూ టెస్టులు, టీ20ల నుంచి తప్పుకుని, వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఇద్దరు సీనియర్లు 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనే సంకల్పంతో ఉన్నారని సమాచారం. అయితే ఈ అంశంపై టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి ఇప్పటివరకు వారికి స్పష్టమైన హామీ అందలేదని తెలుస్తోంది.
Details
టెస్టులకు గుడ్ బై చెప్పిన రోహిత్, కోహ్లీ
ఇదే సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో వీరి సంబంధాలు అంతగా మెరుగుగా లేవన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా టెస్టుల నుండి వీరి రిటైర్మెంట్ వెనుక గంభీర్ ఒత్తిడి ఉందనే విమర్శలు వినిపించాయి. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ మధ్యవర్తిత్వంతో ఓ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీసుల్లో భారత జట్టు వరుసగా ఓటమిపాలైంది. ఈ పరాజయాలకు బాధ్యులుగా రోహిత్, కోహ్లీ పేర్లు ఎత్తి, వారిపై ఒత్తిడి పెంచారన్న వార్తలూ చక్కర్లు కొట్టాయి. ఆ వెంటనే ఇద్దరూ టెస్టులకు గుడ్‌బై చెప్పడంతో, దీనికి కారణం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్న ప్రచారం మరింత బలోపేతమైంది.
Details
రంగంలోకి దిగిన బీసీసీఐ
అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అభిమానుల్లో ఆగ్రహం ఉప్పొంగింది. గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కైవసం చేసుకుంది. ఆ విజయానికి అసలు రూపకర్త మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అని రోహిత్ ఒక కార్యక్రమంలో చెప్పిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. రాంచీలో జరిగిన తొలి వన్డే తరువాత డ్రెస్సింగ్‌రూమ్ వైపు వస్తున్న సమయంలో కోహ్లీ గంభీర్‌ను దాదాపు పట్టించుకోనట్లుగా వ్యవహరించాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు సూచిస్తున్నాయి. సీనియర్లూ-హెడ్ కోచ్ మధ్య పెరుగుతున్న అంతరాలు జట్టుకు హానికరం అనే భావనతో బీసీసీఐ రంగంలోకి దిగింది.
Details
సమావేశం నిర్వహించడానికి ప్లాన్
జట్టులో మంచి వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఒక సయోధ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశంలో 2027 ప్రపంచకప్ కోసం రోహిత్, కోహ్లీల ప్రణాళికలు, అలాగే టీమ్ మేనేజ్‌మెంట్ ఆశలు, అంచనాలు చర్చకు రావనున్నాయి. రెండో వన్డే తర్వాతగానీ, మూడో వన్డే అనంతరంగాని ఈ సమావేశం జరిగే అవకాశమున్నట్లు తెలిసింది.