BCCI: ఐపీఎల్ తర్వాత వరుస సిరీస్‌లు.. భారత జట్టుకు సవాల్.. బీసీసీఐ షెడ్యూల్‌పై గంభీర్, గిల్ అసంతృప్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ తర్వాత టీమిండియాకు విశ్రాంతి లేకుండా కఠినమైన షెడ్యూల్ ఎదురవుతోంది. 2026 ఐపీఎల్ సీజన్ ఫైనల్ మే 31న నిర్వహించనున్నారు. దాని వెంటనే భారత జట్టు వరుస సిరీస్‌లలో పాల్గొనాల్సి ఉండటంతో, ఆటగాళ్లకు తగిన విశ్రాంతి దొరకడం కష్టంగా మారింది. ఈ రద్దీ షెడ్యూల్‌పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బీసీసీఐ నిర్వహణపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
వివరాలు
సీనియర్లకు రెస్ట్..
జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పుర్‌లో భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ఒక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లతో సంబంధం లేకపోవడం గమనార్హం. అందువల్ల ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, యువ ప్రతిభకు అవకాశం కల్పించాలని జట్టు మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వవచ్చని అంచనా. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్, ఆకిబ్ నబీ, దేవదత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లకు ఈ టెస్టులో అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
వివరాలు
బిజీ బిజీ షెడ్యూల్..
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమ్‌ఇండియా బిజీ షెడ్యూల్‌లోకి ప్రవేశించనుంది. జూన్‌లో అఫ్గానిస్థాన్‌తో ఒక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జులై నెలలో ఇంగ్లాండ్‌లో పర్యటించి, అక్కడి జట్టుతో ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తరువాత జులై 23 నుంచి జింబాబ్వేతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమవుతుంది.