
Team India Creates History: ఒకే టెస్ట్ సిరీస్‌లో 500+ రన్స్.. సచిన్‌ను మించిపోయిన గిల్, రాహుల్, జడేజా!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్ట్ సిరీస్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. చివరి టెస్టులో భారత్ 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌కు నిర్దేశించగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు అసాధారణంగా రాణిస్తున్నారు. ఒకే సిరీస్‌లో ముగ్గురు భారత బ్యాటర్లు 500 పరుగుల మార్కు దాటడం టెస్ట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇటీవల, అద్భుత ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకాన్ని సాధించి, సిరీస్‌లో తన మొత్తం పరుగుల సంఖ్యను 500కు పైగా తీసుకెళ్లాడు. జడేజాకు ముందు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇప్పటికే 754 పరుగులతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
Details
అగ్రస్థానంలో సునీల్ గవాస్కర్
ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 532 పరుగులతో నిలిచాడు. ఈముగ్గురూ 500+ పరుగులు చేసినట్లయింది. అయితే ఒకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సునీల్ గావస్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన 1971లో విండీస్‌పై 774 పరుగులు చేశారు. ఇప్పుడు గిల్ ఆ జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. అతడు ఒకే సిరీస్‌లో అత్యధికంగా చేసిన పరుగులు 493 పరుగులు మాత్రమే, అది 2007లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో సాధించాడు. ఈ నేపథ్యంలో గిల్, రాహుల్, జడేజా అందించిన ఈ ఘనతకు క్రికెట్ వర్గాలు, మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.