Mohammed Shami: భారత జట్టుకు గుడ్‌న్యూస్.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న షమీ
గాయపడ్డ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడి, ఆ గాయం నుంచి కోలుకునేందుకు షమీ సర్జరీ చేయించుకున్నాడు. ఎట్టకేలకు టీమిండియా అభిమానులకు షమీ శుభవార్త చెప్పాడు. ప్రస్తుతం 100 శాతం నొప్పి లేకుండా తాను ఫిట్‌గా ఉన్నానని తన ఫిట్‌నెస్ అప్‌డేట్‌ను షేర్ చేశాడు. తాజాగా బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు తర్వాత షమి నెట్స్‌లో పేస్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ సెషన్‌లో పూర్తి రనప్‌తో బౌలింగ్ వేయడం తనకు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పాడు.
ఆసీస్ టూర్‌కు ముందుగా ఫిట్‌నెస్ పరీక్ష
గతంలో అర్థ రనప్‌తో మాత్రమే బౌలింగ్ చేసేవాడినని, అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో బౌలింగ్ వేయడం వల్ల తన ఫిట్‌నెస్‌పై నమ్మకం పెరిగిందని షమి వెల్లడించారు. గతంలో షమీ మోకాళ్ల వాపు కారణంగా అతని పునరాగమనంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు తన ఫిట్‌నెస్‌ని నిలబెట్టుకోవడానికి రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆసీస్ టూర్‌కు ముందు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతానని చెప్పాడు. ఈ వార్త తెలుసుకున్న క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షమి పునరాగమనం టీమిండియాకు శుభపరిణామని కామెంట్లు పెడుతున్నారు.