T20 World Cup: టీమిండియాకు మోదీ, రాహుల్, రాష్ట్రపతి శుభాకాంక్షలు
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా క్రికెట్ ఆటతీరును ప్రశంసిస్తూ మోదీ ట్వీట్ చేశారు. దేశంలోని 140కోట్ల మంది ప్రజలు ఆటగాళ్లను చూసి గర్వపడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. టీ20 ప్రపంచకప్‌ను మాత్రమే కాకుండా దేశంలోని 140 కోట్ల మంది ప్రజల హృదయాలను జట్టు గెలుచుకుందని ఆయన అన్నారు. టీమిండియాపై అభినందిస్తూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన శుభాకాంక్షలను తెలియజేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ, రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వం కృషిని రాహుల్ ప్రశంసించారు. బ్లూ టీమ్ అద్భుతమైన ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారన్నారు.