
Handshake - BCCI: షేక్‌హ్యాండ్ తప్పనిసరి కాదు.. పాక్ ఫిర్యాదుకు బీసీసీఐ కౌంటర్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్‌దీప్ యాదవ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమే పోస్ట్ ప్రెజెంటేషన్‌లో పాల్గొన్నారు. అయితే, పాక్ జట్టు నుంచి ఎవ్వరూ రాలేదు. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయలేదంటూ పాక్ ప్రతినిధులు ఏసీసీ వద్ద నిరసన వ్యక్తం చేసి ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి స్పందిస్తూ, ఆ ఫిర్యాదుకు విలువ లేదని ఖండించారు.'రూల్‌బుక్ చూసుకుంటే తెలుస్తుంది.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయాలని ఎక్కడా నిబంధనలేదు. ఇది పూర్తిగా గుడ్‌విల్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, భారత ఆటగాళ్లు కరచాలనం చేయాల్సిన అవసరం లేదన్నారు.
Details
ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి టీమ్ షీట్ల వరకూ వ్యత్యాసం
ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఎనిమిది జట్ల కెప్టెన్లతో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో భారత్ కెప్టెన్ సూర్యకుమార్, పాక్ సారథి సల్మాన్ అఘా పక్కపక్కన కూర్చోకపోవడం గమనార్హం. మధ్యలో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూర్చున్నాడు. పీసీ ముగిసిన తర్వాత సూర్య, సల్మాన్‌తో కరచాలనం చేశాడు. అలాగే ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ ఖాన్‌తో కూడా షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. దీనిపై భారత అభిమానులు తీవ్రంగా స్పందించారు. మ్యాచ్ రోజున కూడా వ్యత్యాసం కనిపించింది. సాధారణంగా టాస్ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు టీమ్ షీట్లను మార్చుకునేవారు. కానీ, ఈసారి మాత్రం సూర్య, సల్మాన్ ఇద్దరూ షీట్లను నేరుగా రిఫరీకి అప్పగించారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన విషయాలు అందరికీ తెలిసిందే.