LOADING...
IND vs SA: గంభీర్ ప్రియ శిష్యుడిపై ఐసీసీ సీరియస్.. 
గంభీర్ ప్రియ శిష్యుడిపై ఐసీసీ సీరియస్..

IND vs SA: గంభీర్ ప్రియ శిష్యుడిపై ఐసీసీ సీరియస్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి కీలక హెచ్చరిక ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్)ని ఉల్లంఘించినట్లు తేలడంతో, అతడిని అధికారికంగా మందలించింది. ఏం జరిగింది..? దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 22వ ఓవర్ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రోటీస్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను పెవిలియన్‌కు పంపిన అనంతరం, హర్షిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాల్సిందిగా చేతితో సైగ చేశాడు. ఈ చర్యను బ్యాటర్‌ను రెచ్చగొట్టే ధోరణిగా ఐసీసీ పరిగణించి, రాణా క్రమశిక్షణా ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్‌ను జోడించింది. కాగా, గత 24 నెలల్లో రానాకు ఇదే మొదటి తప్పు

వివరాలు 

భారత్ ఘన విజయం 

మ్యాచ్ రిఫరీ, ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానల్ సభ్యుడు రిచీ రిచర్డ్‌సన్ సూచించిన శిక్షను రానా అంగీకరించడంతో, ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండా పోయిందని ఐసీసీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫీల్డ్ అంపైర్లు జయరామన్ మదనగోపాల్, సామ్ నోగాజ్‌స్కీ, థర్డ్ అంపైర్ రాడ్ టక్కర్, ఫోర్త్ అంపైర్ రోహన్ పండిట్ ఈ అంశంపై రానాపై అభియోగాలు మోపారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ సిరీస్ తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి 1-0 ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో భారీగా 349/8 స్కోరు నమోదు చేసింది.

వివరాలు 

చేదనలో సౌతాఫ్రికా తడబాటు 

విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో 135 పరుగులు చేసి తన 52వ వన్డే శతకాన్ని ఖాతాలో వేసుకోగా, రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) అర్ధశతకాలు భారత్ స్కోరు మరింత బలపడేందుకు తోడ్పడ్డాయి. లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా ఆరంభంలోనే దెబ్బతింది. హర్షిత్ రానా ఒకే ఓవర్‌లో రికెల్టన్, డికాక్‌లను వరుసగా ఔట్ చేసి ప్రోటీస్ ఇన్నింగ్స్‌ దెబ్బకొట్టాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ కెప్టెన్ మార్క్రమ్‌ను పెవిలియన్‌కు పంపడంతో పర్యాటక జట్టు కష్టాల్లో పడింది. మిడిల్ ఆర్డర్‌లో మాథ్యూ బ్రీట్జ్‌కీ, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్ గట్టిగా పోరాడినా, కుల్దీప్ యాదవ్ నాలుగు కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశాడు.

Advertisement

వివరాలు 

ఇంతకు ముందు కూడా వివాదాలు 

చివరలో జాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్, బాష్ అర్ధశతకం మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాయి. చివరి ఓవర్‌లో 19 పరుగులు అవసరమైన వేళ ప్రసిద్ధ్ కృష్ణ కీలక సమయంలో బాష్‌ను ఔట్ చేసి భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరించడం హర్షిత్ రానాకు కొత్త కాదు. గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతూ 'ఫ్లయింగ్ కిస్' సెలబ్రేషన్ చేయడంతో నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో బీసీసీఐ అతనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా అదే తరహా ప్రవర్తన కనిపించడంతో అతడిపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి.

Advertisement

వివరాలు 

హెచ్చరిక ఎంత కీలకం..? 

క్రికెట్ నియమావళి ప్రకారం, ఒక ఆటగాడికి 24 నెలల వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డిమెరిట్ పాయింట్లు నమోదు అయితే, అతడికి మ్యాచ్‌ల నుంచి సస్పెన్షన్ విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రానాకు ఒకే డిమెరిట్ పాయింట్ ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తన ప్రవర్తనపై మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Advertisement