Ishan Kishan: జట్టులో లేనప్పుడు ప్రాక్టీస్ చేయడం ఆపలేదు.. అందుకే ఆ బౌలర్‌ని టార్గెట్ చేశా : ఇషాన్ కిషాన్
వన్డే వరల్డ్ కప్ 2023లో భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kisha) రిజర్వ్ బెంచ్ కే పరితమైన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్థానం దక్కించుకున్న ఇషాన్ తొలి మ్యాచులోనే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచ కప్‌లో తాను తుది జట్టులో లేనప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడం ఆపలేదని ఇషాన్ కిషన్ చెప్పాడు. ఇప్పుడిదే టీ20ల్లో రాణించేందుకు ఉపయోగపడిందని తెలిపాడు. ఇవాళ తానేం చేయాలని తనకు తానే ప్రశ్నించుకునేవాడి అని, నెట్స్ లో ప్రతి రోజూ విపరీతంగా శ్రమిస్తూనే ఉన్నానని వెల్లడించారు.
రింకు సింగ్ ఫినిషింగ్ అద్బుతం : ఇషాన్
ఇక ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా బౌలింగ్‌ను టార్గెట్ చేయాలని సూర్యకుమార్ యాదవ్ తనతో చెప్పాడని, అందుకే అతడి బౌలింగ్‌లో కేవలం 10 బంతుల్లో 30 పరుగులు చేశానని ఇషాన్ చెప్పారు. భారీ లక్ష్యం చేధించేటప్పుడు 20 ఓవర్ల పాటు క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాలని, టాప్ ఆర్డర్ ఎక్కువ పరుగులు చేస్తే తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుందన్నారు. సూర్యతో కలిసి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం తనకు ఉందని, అందుకే ఏ బౌలర్‌ను టార్గెట్ చేయాలని మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చాడు. చివర్లో రింకు సింగ్ ఫినిషింగ్ అద్భుతమని ఇషాన్ కిషాన్ కొనియాడారు.