LOADING...
ENG vs NZ: బెంబేలెత్తించిన హెన్రీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కివీస్!
బెంబేలెత్తించిన హెన్రీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కివీస్!

ENG vs NZ: బెంబేలెత్తించిన హెన్రీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కివీస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2026
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌పై 253 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన కివీస్ జట్టు ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో జూన్ 25న జరగనున్న నిర్ణయాత్మక చివరి టెస్టుపై ఆసక్తి మరింత పెరిగింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ శతకంతో (100) మెరిసిపోగా, టామ్ బ్లండెల్ 51 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 44, కైల్ జేమిసన్ 41 పరుగులతో కీలక సహకారం అందించారు.

వివరాలు

291 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ 291 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ 46, ఎమిలియో గే 53 పరుగులతో పోరాడినా, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగుల ఆధిక్యం లభించింది. ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ మరోసారి బ్యాటింగ్‌లో ఆధిపత్యం చెలాయించింది. హెన్రీ నికోల్స్ అద్భుత సెంచరీ (121)తో ఆకట్టుకోగా, రచిన్ రవీంద్ర 76 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 68 పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరి రాణింపుతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 362 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు 463 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

వివరాలు

రాణించిన జో రూట్, హ్యారీ బ్రూక్

భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. జో రూట్ 77, హ్యారీ బ్రూక్ 58 పరుగులు చేసినా, మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనకు ఇంగ్లాండ్ కేవలం 209 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్‌లో మ్యాట్ హెన్రీ ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను చిత్తు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5/80, రెండో ఇన్నింగ్స్‌లో 6/29 గణాంకాలతో మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు సాధించిన హెన్రీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత ప్రదర్శనకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

Advertisement

వివరాలు

జూన్ 25న చివరి టెస్టు

విజయం అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. కీలక సందర్భాల్లో ఆటగాళ్లు బాధ్యత తీసుకుని రాణించారని ప్రశంసించాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ, ఫీల్డింగ్‌లో ఎనిమిది క్యాచ్‌లు వదిలేయడం జట్టుకు భారీ నష్టంగా మారిందని అంగీకరించాడు. ఈ విజయంతో న్యూజిలాండ్ సిరీస్‌ను 1-1తో సమం చేయగా, జూన్ 25న ప్రారంభమయ్యే చివరి టెస్టు మరింత ఉత్కంఠభరితంగా మారింది.

Advertisement