ఆసీస్ ఓటమిపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆసీస్ చెత్త రికార్డులను మూటగట్టుకుంది. టీమిండియా సాధించిన విజయాన్ని ఓర్వలేక కొంతమంది ఆసీస్ మాజీ ఆటగాళ్లు విష ప్రచారం చేస్తున్నారు. భారత జట్టు తమ స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించుకుందని బురదజల్లుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హిలి నాగపూర్ పిచ్‌పై గ్రౌండ్ సిబ్బందిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రాక్టీస్ చేయనీకుండా అడ్డుకున్నారు
తమ ఆటగాళ్లను ప్రాక్టీస్ చేయనీకుండా గ్రౌండ్ సిబ్బంది పిచ్ పై అ సందర్భంగా నీళ్లు చల్లి, ప్రాక్టీస్ చేసుకోకుండా అడ్డుకున్నారని ఇయాన్ హిలి ఆరోపించాడు. ఇది మంచి సంప్రదాయం కాదని, దీనిపై ఐసీసీ జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో హిలి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఆస్ట్రేలియా ఓటమిని ఆ దేశ మీడియా అంగీకరించినా.. కొందరు మాజీ ఆసీస్ ఆటగాళ్లు పిచ్ పై విష ప్రచారం చేస్తూ కాలాన్ని గడుపుతున్నారు. వారి వ్యాఖ్యలపై కొందరు కౌంటర్లు వేయడం గమనార్హం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం రెండో టెస్టుకు అతిథ్యమివ్వనుంది. ఇక్కడ వికెట్ స్పిన్నర్లకు అనుకూలించనుంది.