AFG vs PAK: చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్.. పాక్‌పై విజయం
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా 22వ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో పాక్ పై ఆఫ్గానిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది, చరిత్ర సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆఫ్గాన్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. పాక్ బ్యాటర్లలో బాబార్ అజామ్ (74), అబ్దుల్లా షఫీక్ (58) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆఫ్గాన్ బౌలర్లలో నూర్ మహ్మద్ మూడు వికెట్లు తీయగా, నవీన్ ఉల్ హక్ రెండు, అజ్మతుల్లా, నబీ తలా ఓ వికెట్ పడగొట్టారు.
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఆఫ్గాన్ బ్యాటర్లు
లక్ష్య చేధనలో ఆఫ్గాన్ బ్యాటర్లు పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాబ్(65), ఇబ్రహీం జద్రాన్ (87) పరుగులతో చేసి పాక్ బౌలర్లను హడలెత్తించారు. ఈ క్రమంలో ఇబ్రహీం జద్రాన్ ఆఫ్గాన్ తరుపున వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. చివర్లో రహమత్ షా(77*), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (48*) అద్భుతంగా ఆడి ఆఫ్గాన్ జట్టుకు విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది, హసన్ అలీ తలా ఓ వికెట్ తీశారు.