LOADING...
Ishan Kishan: పుట్టెడు దుఃఖంలోనూ అద్భుత ఇన్నింగ్స్‌.. విజయాన్ని సోదరికి అంకితం చేసిన ఇషాన్‌ కిషన్
విజయాన్ని సోదరికి అంకితం చేసిన ఇషాన్‌ కిషన్

Ishan Kishan: పుట్టెడు దుఃఖంలోనూ అద్భుత ఇన్నింగ్స్‌.. విజయాన్ని సోదరికి అంకితం చేసిన ఇషాన్‌ కిషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan).. పుట్టెడు దుఃఖంలోనూ టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్‌లో ఆడాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన కజిన్‌ సిస్టర్‌కు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇషాన్‌ తెలిపిన వివరాల ప్రకారం,ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోజు అయిన శుక్రవారం తన కజిన్‌ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆ దుఃఖాన్ని మరిచిపోలేకపోయినా ఆమె కోసం బాగా ఆడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ విషయం గురించి జట్టు సహచరుడు హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)తో కూడా మాట్లాడినట్లు వెల్లడించాడు. అతని ప్రోత్సాహంతో జట్టుకు ప్రాధాన్యమిస్తూ మైదానంలో పూర్తి స్థాయిలో ఆడానని తెలిపాడు.

వివరాలు 

సూర్యకుమార్‌ యాదవ్‌తో ఫోన్‌ సంభాషణ

మహిళా దినోత్సవం రోజున వచ్చిన ఈ విజయాన్ని తన సోదరికి అంకితం చేస్తున్నానని ఇషాన్‌ కిషన్‌ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ముందు సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)తో జరిగిన ఫోన్‌ సంభాషణను కూడా ఇషాన్‌ గుర్తు చేసుకున్నాడు. సూర్యకుమార్‌ తనకు ఫోన్ చేసి 'వరల్డ్‌ కప్‌ను గెలిపిస్తున్నావా లేదా?' అని అడిగాడని చెప్పాడు. దానికి తాను 'మీరు నాపై నమ్మకం ఉంచుతున్నారా లేదా?' అని ప్రశ్నించానని తెలిపాడు. అందుకు సూర్యకుమార్‌ 'నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను' అని సమాధానమిచ్చాడని ఇషాన్‌ వివరించాడు.

వివరాలు 

కారు ప్రమాదంలో మరణించిన కజిన్‌ సిస్టర్

ఇషాన్‌ కిషన్‌ కజిన్‌ సిస్టర్‌, ఆమె భర్త మార్చి 6న జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కారణంగా ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడడానికి రావాల్సిన ఇషాన్‌ కుటుంబ సభ్యులు అక్కడికే పరిమితమయ్యారు. ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఇషాన్‌ కిషన్‌ తన బ్యాట్‌ను ఆకాశం వైపు ఎత్తి చూపిస్తూ సోదరికి నివాళులర్పించాడు.

Advertisement

వివరాలు 

ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఇషాన్‌ కిషన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54 పరుగులు సాధించాడు. మొత్తం టోర్నమెంట్‌లో అతడు 9 మ్యాచ్‌లు ఆడి 317 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. కొంతకాలంగా భారత జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్‌ కిషన్‌ ఈ టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులో అనూహ్యంగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఫైనల్‌లో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు.

Advertisement