
Hulk Hogan: రెజ్లింగ్ స్టార్ లెజెండ్ 'హల్క్ హోగన్' గుండెపోటుతో మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ రెజ్లింగ్ లెజెండ్,డబ్ల్యూడబ్ల్యూఈ ఐకాన్ హల్క్ హోగన్ మరణించారు.ఫ్లోరిడాలో ఉన్న తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. 71 ఏళ్ల హోగన్‌కు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత అనిపించడంతో, క్లియర్‌వాటర్‌లోని ఆయన నివాసానికి అత్యవసర వైద్య బృందాలు తక్షణమే చేరుకున్నాయి. అనంతరం ఆయన్ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హల్క్ హోగన్ అసలు పేరు టెర్రీ జీ. బొలియా. 1953 ఆగస్టు 11న అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జన్మించిన ఆయన, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన రెజ్లర్‌గా మాత్రమే కాకుండా, ఆ క్రీడను ప్రజల మధ్య మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.
వివరాలు
కోమాలో హల్క్ హోగన్
1980,1990 దశకాలలో ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన రెజ్లింగ్ స్టార్లలో ఒకరిగా నిలిచారు. తనదైన ఆహార్యంతో ఉర్రూతలూగించారు. ఆయన కెరీర్‌లో అనేక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకుని గొప్ప ప్రతిష్ఠను సంపాదించారు. కొద్ది వారాల క్రితం హల్క్ హోగన్ కోమాలో ఉన్నారనే వార్తలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆ వార్తలను ఆయన భార్య స్కై డైలీ (45) ఖండించారు.హోగన్ ఇటీవల ఓ శస్త్రచికిత్సకు లోనై, ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన గుండె చాలా బలంగా ఉందని అభిమానులను ఉద్దేశిస్తూ ప్రకటించారు.
వివరాలు
ట్రంప్‌కు మద్దతు
గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హల్క్ హోగన్ డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. ట్రంప్ పక్షాన జరిగిన ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఓ సభలో ఆయన తన షర్ట్‌ను చింపుతూ, ఆవేశపూరితంగా మాట్లాడిన తీరు అక్కడున్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది. హోగన్ ప్రసంగం అనంతరం,ఆ కార్యక్రమంలో ఉన్నవారంతా ఆయనకు చప్పట్లతో అభినందనలు తెలుపగా, ట్రంప్ స్వయంగా నిలబడి హల్క్ హోగన్‌ను ప్రశంసించడం ప్రత్యేకంగా నిలిచింది.