Pakistan team: పాకిస్థాన్ జట్టుకు నెట్ బౌలర్‌గా హైదరాబాద్ కుర్రాడు
వన్డే వరల్డ్ కప్ 2023 మహాసంగ్రామం మరో వారం రోజుల్లో మొదలు కానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచులో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ టోర్నీకి ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచులు ఆడేందుకు అన్నీ జట్లు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచులు జరగనున్నాయి. ఈ ప్రాక్టీసు మ్యాచులకు హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి వేదికలగా మారనున్నాయి. ఈ వార్మప్ మ్యాచుల్లో పాకిస్థాన్ జట్టు శుక్రవారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అండర్-19 ఫాస్ట్ బౌలర్ నిశాంత సర పాకిస్థాన్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఈ యువ పేసర్ గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలడు.
నిశాంత్ పై ప్రశంసల వర్షం కురిపించిన పాక్ బ్యాటర్
న్యూజిలాండ్ వార్మప్ మ్యాచుకు ముందు నెట్స్ లో పాక్ బ్యాటర్లకు నిశాంత్ బౌలింగ్ చేస్తూ కన్పించడం విశేషం. ఆరు అడుగులకు పైగా ఉన్న నిశాంత్ బౌన్సర్లను అద్భుతంగా వేయగలడు. నెట్స్ లో అతడి బౌలింగ్‌లో ఆడిన పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. నిశాంత్ భవిష్యతులో అత్యున్నత స్థాయికి చేరుకుంటాడని జమాన్ తెలిపారు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ తనకు ఆదర్శమని, భవిష్యతులో హైదరాబాద్ కు ఆడాలన్నదే తన కోరిక అని నిశాంత్ పేర్కొన్నాడు.