Buchi Babu Tournament: టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ పై గెలిచి.. ఫైనల్ చేరిన హైదరాబాద్
ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు చేరింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టిఎన్‌సీఏ) ప్రెసిడెంట్ ఎలెవన్‌పై 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ మొదటి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేయగా, టిఎన్‌సీఏ ప్రెసిడెంట్ ఎలెవన్ 327 పరుగులతో స్వల్ప ఆధిక్యం సాధించింది. దాంతో, రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 273/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఛేదనలో టిఎన్‌సీఏ ప్రెసిడెంట్ ఎలెవన్ 68.2 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లలో తనరు త్యాగరాజన్ 5 వికెట్లు, అనికెత్ రెడ్డి 4 వికెట్లు తీసి ప్రతిభ చూపారు.
జగన్ అభినందనలు
మొత్తం 12 వికెట్లు తీసిన తనరు త్యాగరాజన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మరో సెమీఫైనల్లో చత్తీస్‌గఢ్ టిఎన్‌సీఏ ఎలెవన్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజయం సాధించి ఫైనల్‌కు అర్హత పొందింది. ఫైనల్లో హైదరాబాద్, చత్తీస్‌గఢ్ మధ్య పోటీ జరగనుంది. హైదరాబాద్ జట్టు ఘనతపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు అభినందనలు తెలియజేశారు. రెండు దశాబ్దాల తర్వాత బుచ్చిబాబు టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకోవడం సంతోషకరమని తెలిపారు.