Ravichandran Ashwin: ఆ విషయం మూడు-నాలుగేళ్లుగా చెబుతున్నా వినడంలేదు : రవిచంద్రన్ అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు స్వదేశంలో అరుదైన పరాభవాన్ని ఎదురుకుంది. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం 25 ఏళ్ల తర్వాత మొదటిసారి. చివరిసారిగా 2000లో భారత జట్టుకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కోల్‌కతా టెస్ట్‌లో 30 పరుగుల తేడాతో ఓడిన భారత్, గువాహటి టెస్ట్‌లో ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత పెద్ద పరాజయం. ఇంతకు ముందు 2004లో నాగ్‌పూర్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో 342 పరుగుల తేడాతో భారత్ ఓడింది. ఈ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమేనని టీమ్‌ఇండియా మాజీ స్టార్ ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Details
బ్యాటర్లు పూర్తిగా విఫలం
ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ప్రస్తుత భారత బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించాడు. ''మన బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. భారత బ్యాటర్లు సరిగా స్వీప్ షాట్లు ఆడటం లేదని నేను 3-4 ఏళ్లుగా చెబుతూనే ఉన్నా. ఇటీవల న్యూజిలాండ్ జట్టు స్వీప్‌ను ఎలా డిఫెన్స్‌గా ఉపయోగించిందో చూశాం. వారు ఒక బంతిని డిఫెండ్ చేస్తే, మరోదానిని స్వీప్ ద్వారా అద్భుతంగా ఆడారు. దాని కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు వారి ఆటతీరులో కనిపించిందని తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ విశ్లేషించాడు.
Details
డిఫెన్స్ ఆడకపోతే ఎలా
'దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ బౌలింగ్ ఎదుర్కొంటూ మన బ్యాటర్లు ఎన్ని సార్లు పక్కా డిఫెన్స్ ఆడగలిగారు? డిఫెన్స్ పటుత్వం లేకపోతే బ్యాటర్లు ఆకస్మిక షాట్ల వైపు మొగ్గుతారు. పెద్ద షాట్లు ఆడటమే మా ఆటతీరు అని చెప్పడం సాకులే. గొప్ప ఆటగాడి నైపుణ్యం అతని డిఫెన్స్‌లోనే తెలుస్తుంది. ప్రస్తుతం భారత బ్యాటర్లు స్పిన్‌ను సరిగా ఆడలేకపోవడమే ప్రధాన సమస్య. స్పిన్ ఎదుర్కోవడంలో టీమ్‌ఇండియా ప్రస్తుతం అట్టడుగున ఉందని అశ్విన్ స్పష్టం చేశాడు.