
Sanjog Gupta: ఐసిసి సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన జియోస్టార్ అధిపతి సంజోగ్ గుప్తా
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కొత్త సీఈఓగా సంజోగ్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఆయన దుబాయ్‌లో ఉన్న ఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ పదవిని చేపట్టారు. ఐసీసీ చరిత్రలో ఏడవ సీఈఓగా ఆయన స్థానం సంపాదించగా,గతంలో ఆయన జియోస్టార్ స్పోర్ట్స్ & లైవ్ ఎక్స్‌పీరియన్స్ విభాగానికి సీఈఓగా సేవలందించారు. వ్యాపార విజన్‌తో ఐసీసీ అభివృద్ధికి తోడ్పడగల గుణాలను గమనించిన క్రికెట్ మండలి ఆయనను తమ బృందంలో చేర్చుకుంది. గత నాలుగేళ్లుగా ఐసీసీకి సీఈఓగా ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అలార్డైస్ ఈ ఏడాది ప్రారంభంలో రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవికి ప్రపంచవ్యాప్తంగా 25దేశాల నుంచి 2,500 కంటే ఎక్కువ మంది అభ్యర్థుల నుండి దరఖాస్తులు వచ్చాయి.
వివరాలు
సంజోగ్ గుప్తా అనుభవం ఐసీసీ ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుంది
ఐసీసీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా నేతృత్వంలోని నామినేషన్ల కమిటీ, దరఖాస్తులపై సమీక్షించి 12 మందిని షార్ట్‌లిస్ట్ చేసింది. చివరికి సంజోగ్ గుప్తా పేరును సీఈఓగా సిఫార్సు చేయగా, ఐసీసీ ఛైర్మన్ జయ్ షా ఆమోదించడంతో ఆయనను అధికారికంగా నియమించారు. సంజోగ్ గుప్తా, జియోస్టార్‌లో ఉన్న సమయంలో వ్యూహాత్మకంగా క్రీడా వ్యాపారాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. క్రికెట్ వాణిజ్యీకరణ,వ్యాపార అభివృద్ధి,అంతర్జాతీయ క్రీడా మార్కెటింగ్‌లో ఆయనకు గొప్ప అనుభవం ఉంది. ఈ అనుభవం ఐసీసీ ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని జయ్ షా అభిప్రాయపడ్డారు.
వివరాలు
మీడియా రంగం నుంచి వచ్చిన వ్యక్తి ఐసీసీ సీఈఓ పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి
ముఖ్యంగా మీడియా రంగం నుంచి వచ్చిన వ్యక్తి ఐసీసీ సీఈఓ పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి కావచ్చునని ఆయన పేర్కొన్నారు. 2028లో నిర్వహించనున్న లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే కసరత్తులు జరుగుతున్న తరుణంలో, క్రికెట్‌ను అంతర్జాతీయంగా మరింత వాణిజ్య పరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇదిలా ఉండగా, హాట్‌స్టార్, జియో బ్రాడ్‌కాస్టింగ్ వ్యాపారాల విలీనంతో ఏర్పడిన జియోస్టార్ సంస్థ, ఇటీవల బలమైన పెట్టుబడులు పెట్టింది. ఈ నేపథ్యంలో సంస్థ కొత్త సీఈఓగా ఇషాన్ ఛటర్జీని నియమించింది. ఇషాన్, గతంలో యూట్యూబ్ ఇండియాకి నేతృత్వం వహించగా, 2024లో జియోస్టార్‌కి చేరారు. ఇప్పుడు ఆయన్ను సంస్థ సీఈఓగా నియమించడం విశేషం.