
Team India: స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా వుమెన్స్ జట్టుకు ICC జరిమానా..
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత మహిళల క్రికెట్ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది.
ఆదివారం కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయలేకపోవడంతో,ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించినట్లు ప్రకటించింది.
ఈ నియమం ప్రకారం స్లో ఓవర్ రేట్‌కు ఇది శిక్షగా పరిగణించబడింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ తప్పును అంగీకరించడంతో, అదనపు విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది.
వివరాలు
అద్భుతమైన ప్రదర్శన చేసిన దీప్తి శర్మ
ఇక ఈ ముక్కోణపు సిరీస్‌లో భారత్ ఇప్పటివరకు రెండు విజయాలు సాధించింది.మొదటి మ్యాచ్ వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించబడింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మహిళల జట్టు 38.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం భారత జట్టు కేవలం 29.4ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 149 పరుగులు చేసి, మ్యాచ్‌ను 56 బంతులు మిగిలి ఉండగానే నెగ్గింది.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా 31పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది.ఎడమచేతి స్పిన్నర్ చరణి రెండు వికెట్లు తీసేందుకు 26 పరుగులే ఇచ్చింది.
సీనియర్ ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ 5.1 ఓవర్లలో 22 పరుగులకు రెండు వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.
వివరాలు
దక్షిణాఫ్రికాను 15 పరుగుల తేడాతో ఓడించిన భారత్
సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాను 15 పరుగుల తేడాతో ఓడించింది.
మంగళవారం కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రతీకా రావల్ అర్ధ శతకంతో రాణించడంతో, భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది.
అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరఫున తాజ్మిన్ బ్రిట్స్ అత్యధికంగా 109 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో స్నేహ్ రాణా ఐదు వికెట్లు పడగొట్టగా, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, దీప్తి శర్మ తలో ఒక్క వికెట్‌ను దక్కించుకున్నారు.