Page Loader
ICC New rules: ICC మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఐదు కొత్త రూల్స్ ఇవే..
ICC మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఐదు కొత్త రూల్స్ ఇవే..

ICC New rules: ICC మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఐదు కొత్త రూల్స్ ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కోసం ఐదు కొత్త నియమాలను ప్రకటించింది. గురువారం (జూన్ 26) ఈ కొత్త రూల్స్‌ను అధికారికంగా వెల్లడించింది. ఈ మార్పులలో ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ పై దృష్టి పెట్టడం గమనార్హం. గత వారం కంకషన్ సబ్‌స్టిట్యూట్ విషయంలో ఏర్పడిన అనిశ్చితిని నివారించగా, వన్డే క్రికెట్‌లో బ్యాట్, బాల్ మధ్య సమతుల్యత కోసం బంతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్ట్ ఫార్మాట్‌లో స్టాప్ క్లాక్ అమలుతో పాటు, డీఆర్ఎస్ విధానంలో కీలక మార్పులు చేసి, మూడు ఫార్మాట్‌లకూ వర్తించే విధంగా ఐసీసీ కొత్త రూల్స్‌ను రూపొందించింది. ఈ కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

1. టెస్ట్ క్రికెట్ లో స్టాప్ క్లాక్:

ఇప్పటివరకు స్టాప్ క్లాక్ నియమం వన్డేలు, టీ20లకే పరిమితమై ఉంది. కానీ ఇకపై టెస్ట్ క్రికెట్‌లోనూ దీన్ని అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. టెస్ట్ మ్యాచ్‌లలో ఓవర్ రేట్ల ఆలస్యం సమస్యను ఎదుర్కొనేందుకు ఈ నియమాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం, ఫీల్డింగ్ జట్టు పూర్వపు ఓవర్ ముగిసిన 60 సెకన్ల లోపే తదుపరి ఓవర్‌ను ప్రారంభించాలి. ఈ గడువు దాటితే మొదట అంపైర్లు వార్నింగ్ ఇస్తారు. అయితే ఇది రెండు సార్లు మించితే, బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. ప్రతి 80 ఓవర్ల తరువాత ఈ గడియారం రీసెట్ అవుతుంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో ఈ నియమం ఇప్పటికే అమలవుతోంది.

వివరాలు 

2.లాలాజల నియమం సడలించబడింది: 

కరోనా సమయంలో బంతిపై లాలాజల వాడకంపై పూర్తిస్థాయి నిషేధం అమలైంది. ఇటీవల ఈ నిషేధాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని కొంతమంది ఆటగాళ్లు ప్రయోజనంగా మార్చుకొని, బంతిని కావాలనే మారుస్తూ కొత్త బంతిని పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించారు. దీనికి చెక్ పెట్టేందుకు తాజా రూల్‌లో, అంపైర్లు బంతిని పర్యవేక్షించి, దాని స్వరూపం గణనీయంగా మారిందని తేల్చితే మాత్రమే కొత్త బంతిని ఇస్తారు. ఉద్దేశపూర్వకంగా లాలాజలాన్ని బలవంతంగా రుద్దితే, ఆ బౌలింగ్ జట్టు పట్ల ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు.

వివరాలు 

3.DRS విధానంలో కొత్త మార్పు: 

ఈ మార్పు ప్రకారం, ఉదాహరణకు ఫీల్డింగ్ జట్టు క్యాచ్ కోసం అప్పీల్ చేస్తే, అంపైర్ ఔట్ అని ప్రకటిస్తాడు. ఈ నిర్ణయంపై బ్యాటింగ్ జట్టు రివ్యూ కోరితే, మొదట థర్డ్ అంపైర్ అల్ట్రా ఎడ్జ్‌ను తనిఖీ చేస్తాడు. అక్కడ బంతి బ్యాట్‌ను తాకనట్టుగా తేలితే, వెంటనే ఎల్బీడబ్ల్యూ కోణంలో పరిశీలిస్తారు. ఎల్బీడబ్ల్యూలో ఔట్ అన్న తీర్పు వచ్చినా లేదా అంపైర్స్ కాల్ వచ్చినా, మొదటి నిర్ణయం అవే కొనసాగుతుంది. అంటే ఒకే రివ్యూలో రెండు కోణాల్లోని వివరణలు కనిపెట్టేలా చేసిన మార్పు ఇది.

వివరాలు 

4.నో బాల్ లో క్లీన్ క్యాచ్ పడితే పరుగులు ఉండవు: 

పాత నియమాల ప్రకారం, నో బాల్ వేయబడినప్పుడు పడిన క్యాచ్‌ను ఔట్‌గా పరిగణించరు. అయితే ఇప్పుడు నో బాల్ వేయబడిన సమయంలో పడిన క్యాచ్ క్లీన్‌గా ఉందా? కాదా? అనే అంశాన్ని పరిశీలిస్తారు. క్యాచ్ పూర్తిగా క్లీన్‌గా పట్టినట్లయితే, బ్యాటర్లు అప్పటివరకు పూర్తిగా తిరిగిన పరుగులను లెక్కించరు. కేవలం నో బాల్ పరుగు మాత్రమే స్కోరులో చేర్చబడుతుంది. కానీ క్యాచ్ క్లీన్‌గా లేకపోతే, బ్యాటర్లు పూర్తి చేసిన పరుగులను జత చేస్తారు. అంతేకాదు క్యాచ్ సరిగా పట్టకుండా ఔట్ అని అప్పీల్ చేస్తే.. థర్డ్ అంపైర్ చెక్ చేశాక అది క్లీన్ క్యాచ్ కాదని నాటౌట్ గా తెలితే నో బాల్ గా ప్రకటిస్తారు.

వివరాలు 

5.షార్ట్ రన్ తీస్తే భారీ మూల్యం: 

బ్యాటర్లు పరుగు తీసేటప్పుడు, క్రీజ్‌లో బ్యాట్ లేదా శరీరం పూర్తిగా ప్రవేశించకుండా పరుగులు కొనసాగిస్తే, దాన్ని షార్ట్ రన్‌గా పరిగణిస్తారు. ఈ రకమైన పరిస్థితుల్లో గతంలో అంపైర్లు చేతినిచ్చి రన్ లెక్క చేయకుండా హెచ్చరిక ఇస్తుండేవారు. కానీ ఇప్పుడు ఈ నియమం కఠినతరం అయింది. నూతన మార్పుల ప్రకారం, షార్ట్ రన్ అయిన ప్రతీసారీ ఆ బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. అంతేకాదు, తదుపరి బంతికి స్ట్రైక్ ఎవరికి ఇవ్వాలనే ఎంపికను ఫీల్డింగ్ జట్టుకు ఇస్తారు.