ODI WC 2023: పాక్ కోచ్ మికీ ఆర్థర్ కామెంట్లపై ఐసీసీ అదిరిపోయే కౌంటర్
ప్రపంచ కప్‌లో వరుసగా ఎనిమిదోసారి టీమిండియా చేతుల్లో చిత్తుగా ఓడిపోవడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. భారత్-పాక్ (IND-PAK) మ్యాచ్ ఐసీసీ ఈవెంట్‌లా అనిపించడం లేదని, బీసీసీఐ(BCCI) కార్యక్రమంలా ఉందని ఇప్పటికే పాక్ కోచ్ మికీ అర్థర్ విమర్శలు చేశారు. దీనిపై ఐసీసీ(ICC) స్పందించింది. తాము నిర్వహించే ప్రతి ఈవెంట్ పై ఏదో ఒక దశలో విమర్శలు వస్తుంటాయని, వాటికి తాము దూరంగా ఉంటామని ఐసీసీ పేర్కొంది. మరింత ఉత్తమంగా టోర్నీని నిర్వహించేందుకు మాత్రమే తాము అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పుడే మెగా సమరం ప్రారంభమైందని, ఇంకా చాలా మ్యాచులు జరగాల్సి ఉందని ఐసీసీ వెల్లడించింది.
క్రికెట్ ను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు కృషి
ఇంకా చాలా మ్యాచులు జరగాల్సి ఉందని, టోర్నీని మరింత నాణ్యంగా ఎలా నిర్వహించాలో అనే విషయాలపై కసరత్తు చేస్తామని ఐసీసీ తెలిపింది. క్రికెట్‌ను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు ఎళ్లవేళలా ప్రయత్నిస్తూనే ఉంటామని, కచ్చితంగా ఇదొక అత్యుత్తమ వరల్డ్ కప్ గా నిలుస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. పాక్ కోచ్ మికీ అర్థర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఓటమి గల కారణాలను విశ్లేషించుకోవాలని పాక్ మాజీలు హితువు పలికారు. మరోవైపు కోహ్లీ నుంచి పాక్ కెప్టెన్ బాబార్ అజామ్ భారత జెర్సీని తీసుకోవడంపై కూడా విమర్శలు వచ్చాయి.