
ICC : ఐసీసీ చారిత్రక నిర్ణయం.. మహిళా క్రికెటర్లకు సమాన గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. పురుషుల క్రికెట్‌ను మించిపోయేలా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ ప్రైజ్‌మనీని రికార్డు స్థాయిలో పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల క్రితం భారత్‌లో జరిగిన పురుషుల ప్రపంచకప్ (10 మిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ మొత్తాన్ని మహిళల టోర్నీకి కేటాయించడం విశేషం. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరగనున్న 2025 మహిళల వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ ఏకంగా 13.88 మిలియన్ డాలర్లు (సుమారు రూ.122 కోట్లు) ప్రైజ్‌మనీగా కేటాయిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన టోర్నీకి కేటాయించిన 3.5 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది దాదాపు 297 శాతం అధికం.
Details
ఆస్ట్రేలియా పొందిన ప్రైజ్‌మనీకంటే 239 శాతం ఎక్కువ
ఈ ప్రకారం, టోర్నీ విజేత జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.39 కోట్లు) అందజేస్తారు. ఇది 2022లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా పొందిన ప్రైజ్‌మనీకంటే 239 శాతం ఎక్కువ. రన్నరప్‌గా నిలిచే జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.19 కోట్లు) లభిస్తాయి. సెమీఫైనల్లో ఓడిన జట్లకు చెరో 1.12 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.9 కోట్లు) ఇవ్వనున్నారు. గ్రూప్ దశలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం 2,50,000 డాలర్లు (సుమారు రూ.2 కోట్లు) గ్యారెంటీ మనీగా అందుతుంది. అదనంగా, గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు 34,314 డాలర్లు (దాదాపు రూ.30 లక్షలు) ఇవ్వనున్నారు.
Details
మహిళల క్రికెట్ ప్రయాణంలో మైలురాయి
ఈ చారిత్రక నిర్ణయంపై ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందిస్తూ, ''మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఒక మైలురాయి. ప్రైజ్‌మనీని నాలుగు రెట్లు పెంచడం ద్వారా మహిళల క్రికెట్ దీర్ఘకాలిక అభివృద్ధికి మా నిబద్ధతను స్పష్టం చేస్తున్నాం. మహిళా క్రికెటర్లు ఈ క్రీడను వృత్తిగా ఎంచుకుంటే పురుషులతో సమానంగా గౌరవం పొందుతారని తెలియజేయడమే మా ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ సెప్టెంబర్ 30న గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య ప్రారంభమవుతుంది. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.