Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీ చర్చలు.. రద్దయ్యే ఛాన్స్?
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో నిర్వహించాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఐసీసీ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత్ పాకిస్థాన్ పర్యటనను ఖచ్చితంగా వెళ్లమని చెప్పడంతో ఈ టోర్నీని నిర్వహించడం కష్టంగా మారింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీని తమ దేశంలోనే నిర్వహిస్తామని పట్టుదలగా ఉన్నప్పటికీ, షెడ్యూలింగ్ సమస్యలు ఎదురవుతుండటంతో టోర్నీని వాయిదా వేసే లేదా రద్దు చేసే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పీసీబీ ఇప్పటికే 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ నిర్వహణ కోసం ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి అందజేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూలింగ్‌లో ఇబ్బందులు
అయితే భారత్ మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌తో నిర్వహించాలని ఐసీసీ ప్రతిపాదించగా, పీసీబీ దీన్ని అంగీకరించకపోవడం మరో సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూలింగ్‌లో ఇబ్బందులు వస్తున్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఐసీసీ వర్గాల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఆతిథ్య దేశంతో పాటు పాల్గొనే జట్లతో చర్చలు కొనసాగుతున్నాయి. షెడ్యూలింగ్ కుదరకపోతే టోర్నీని రద్దు లేదా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.