ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-30లో చోటు కోల్పోయిన రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భారత బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖులు అంచనాలను అందుకోలేకపోయారు, దీని ప్రభావం వారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌పై స్పష్టంగా కనిపించింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం,రోహిత్ శర్మ టాప్-30లో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఆరు స్థానాలు దిగజారి 31వ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐదు స్థానాలు కోల్పోయి 20వ ర్యాంక్‌లో నిలిచాడు. యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, రిషభ్ పంత్ మూడు స్థానాలు దిగజారి 9వ ర్యాంక్‌కు పడిపోయాడు. శుభ్‌మన్ గిల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 17వ ర్యాంక్‌లో నిలిచాడు, అయితే నితీశ్ కుమార్ రెడ్డి ఆరు స్థానాలు ఎగబాకి 69వ స్థానాన్ని సాధించాడు.
డిసెంబరు 14న గబ్బా స్టేడియం వేదికగా మూడో టెస్టు
ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (898) ఒక్క పాయింట్ తేడాతో జో రూట్ (897)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని చేపట్టాడు. భారత్‌తో పింక్ టెస్టులో అద్భుతమైన శతకం బాదిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ టాప్-10లో చేరాడు. అతను ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు, కాగా అశ్విన్ ఒక స్థానం డౌన్ ఐదులో, రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో పెద్దగా మార్పులు జరగలేదు. ఇక, ఆసీస్, భారత్ మధ్య మూడో టెస్టు డిసెంబరు 14న గబ్బా స్టేడియం వేదికగా ప్రారంభంకానుంది.