
India Women Defeat: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత జట్టు పరాజయాల పరంపరం కొనసాగుతోంది. మరోసారి ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో విజయం అందుకోవాల్సిన భారత జట్టు చివరలో చేజార్చుకుంది. కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 284 పరుగులకే ఆలౌటై పరాజయాన్ని చవిచూసింది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన మెరిసింది. ఆమె 94 బంతుల్లో 88 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 70 బంతుల్లో 70 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది.
వివరాలు
ఈ పరాజయంతో భారత్‌కి సెమీఫైనల్ అవకాశాలు మరింత కఠినం
దీపి శర్మ వేగంగా బ్యాటింగ్ చేస్తూ 57 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. మ్యాచ్ భారత జట్టుకు అనుకూలంగా సాగుతున్నప్పటికీ, చివరి దశల్లో వరుస వికెట్లు కోల్పోవడం వల్ల పరిస్థితి దిగజారింది. బౌండరీలు లేకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణమైంది. ఈ పరాజయంతో భారత్‌కి సెమీఫైనల్ అవకాశాలు మరింత కఠినమయ్యాయి. ఇంగ్లండ్‌పై ఓటమి అభిమానులను నిరాశపరిచింది. భారత్ చేతులారా విజయాన్ని కోల్పోయిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "మిగిలిన 30 బంతుల్లో కేవలం 36 పరుగులు అవసరం ఉండగా, ఆరు వికెట్లు చేతిలో ఉండి గెలవలేకపోవడం ఆశ్చర్యకరం" అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనతో భారత్‌కి వరల్డ్ కప్ గెలుచుకోవడం చాలా కష్టమని విశ్లేషకులు అంటున్నారు.
వివరాలు
న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై తప్పనిసరిగా గెలవాలి
భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్‌లో స్థానం సంపాదించాయి. భారత్ సెమీస్ చేరాలంటే... రాబోయే రెండు మ్యాచ్‌లు — న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై తప్పనిసరిగా గెలవాలి. అలా గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా సెమీస్‌లో చోటు సంపాదించగలదు. ఒకవేళ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఓడితే బంగ్లాదేశ్ పై తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాల్సి ఉంటుంది. అదనంగా, ఇతర జట్ల కంటే మెరుగైన రన్‌రేట్ ఉంటేనే భారత్ సెమీఫైనల్ దశకు అర్హత సాధిస్తుంది.