IND vs BAN: హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ గేమ్.. మెరిసిన రిషబ్ పంత్.. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం (జూన్ 1) జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు 183 పరుగుల విజయ లక్ష్యం ఉండగా, 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మదుల్లా రియాద్ 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 40 పరుగులు చేశాడు. కాగా,షకీబ్ అల్ హసన్ 34 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. భారత్ తరఫున శివమ్ దూబే,అర్ష్‌దీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు.జస్ప్రీత్ బుమ్రా,హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్,మహ్మద్ సిరాజ్ తలా ఓ వికెట్ తీశారు.
విరాట్ కోహ్లికి విశ్రాంతి
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత్ తరఫున రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు. పంత్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. కాగా, హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో అజేయంగా 40 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ తరఫున మహేదీ హసన్, షోరిఫుల్ ఇస్లామ్, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లాం ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చారు. కాగా సంజూ శాంసన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేశాడు.
భారత జట్టు తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో..
టీ20 ప్రపంచ కప్ 2024లో, భారత జట్టు ఐర్లాండ్, పాకిస్తాన్, USA, కెనడాతో పాటు గ్రూప్ A లో ఉంది. భారత జట్టు తొలి మూడు గ్రూప్ మ్యాచ్‌లు న్యూయార్క్‌లో జరగనున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది. రెండో మ్యాచ్ లో జూన్ 9న పాకిస్థాన్‌తో ఆడనుంది. జూన్ 12న అమెరికాతో, జూన్ 15న ఫ్లోరిడాలో కెనడాతో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్),యశస్వి జైస్వాల్,విరాట్ కోహ్లీ,సూర్యకుమార్ యాదవ్,రిషబ్ పంత్ (వికెట్ కీపర్),శివమ్ దూబే,హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్),రవీంద్ర జడేజా,అక్సర్ పటేల్,కుల్దీప్,జస్ప్రీత్ బుమ్రా,అర్ష్దీప్ సింగ్,యుజ్వేంద్ర చాహల్,సంజు శాంసన్(వికెట్ కీపర్),మహ్మద్ సిరాజ్. రిజర్వ్: శుభ్‌మన్ గిల్,రింకూ సింగ్,ఖలీల్ అహ్మద్,అవేష్ ఖాన్