సిరీస్ మధ్యలో జట్టును విడిచి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చెత్తగా ఆడుతోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆశలను వదలుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఉన్నపళంగా సోమవారం స్వదేశానికి బయలుదేరాడు. ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కారణంగానే కమిన్స్ సిడ్నీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మార్చి 1న జరగనున్న మూడో టెస్టుకు ముందు అతను మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాడని ఆసీస్ క్రికెట్ తెలిపింది. ముఖ్యంగా బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 0-2తో వెనుకంజలో ఉంది.
కమిన్స్ తప్పుకుంటే స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ..?
ఒకవేళ పాట్ కమిన్స్ మూడో టెస్టుకు అందుబాటులోకి రాకపోతే వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా నాయకత్వ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌కు దాదాపు 10 రోజులు సమయం ఉండటంతో కమిన్స్ తిరిగివచ్చి జట్టుతో కలిసే అవకాశం ఉంది. కమ్మిన్స్ అందుబాటులో లేకుంటే మిచెల్ స్టార్క్ లేదా జోష్ హేజిల్‌వుడ్ ఆసీస్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు పేసర్లు ప్రస్తుతం గాయం బెడదతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మూడో టెస్టుకు కామెరాన్ గ్రీన్ ఫిట్ గా ఉన్నట్లు సమాచారం. నవంబర్ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కమిన్స్ టెస్టుల్లో సంచలనం సృష్టించాడు. కమిన్స్ 49 టెస్టుల్లో 21.51 సగటుతో 217 వికెట్లు పడగొట్టాడు.