రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి అల్లాడిపోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి ఆస్ట్రేలియా జట్టు అల్లాడిపోయింది. జడేజా ఏడు వికెట్లతో విజృంభించడంతో ఆసీస్ 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకున్న రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ టెస్టులో 10వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్టులో 10 వికెట్ల తీయడం జడేజాకు ఇది రెండోసారి కావడం గమనార్హం.
రెండు టెస్టుల్లో మొత్తం 17 వికెట్లు పడగొట్టిన జడేజా
కేవలం 12.1 ఓవర్లలో 7/42 విలువైన గణాంకాలతో జడేజా అదరగొట్టాడు. 2వ రోజు సాయంత్రం సెషన్‌లో ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేసిన జడేజా, 3వ రోజు ఉదయం మార్నస్ లాబుస్‌చాగ్నే (35)ను పెవిలియన్‌కు పంపడంతో తన వికెట్ల వేట మొదలైంది. ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో కలిసి మొత్తం 17 వికెట్లు పడగొట్టి, తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. టెస్టుల్లో 2,500 పరుగులు, 250 వికెట్లను అత్యంత వేగవంతంగా సాధించిన రెండో ఆల్ రౌండర్ జడేజా కావడం గమనార్హం. జడేజా 62 టెస్టుల్లో 36.89 (18హాఫ్ సెంచరీలు, 3సెంచరీలు)సగటుతో 2,619 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 23.82 సగటుతో 257 వికెట్లను పడగొట్టాడు.