Ind vs NZ: భారత్‌లో తొలి టెస్టు సిరీస్ విజయంపై న్యూజిలాండ్ దృష్టి.. 301 పరుగుల ఆధిక్యం
పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. టామ్ లాథమ్ (86; 133 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విల్ యంగ్ (23), డేరియల్ మిచెల్ (18)ఫర్వాలేదనిపించారు.ప్రస్తుతం టామ్ బ్లండెల్ (30*), ఫిలిప్స్ (9*) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు.
భారత్ ఎదుట కొండంత లక్ష్యాన్ని ఉంచే అవకాశం
మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చూపించిన భారత్ బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచింది. 156 పరుగులకే కుప్పకూలిపోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసి, అప్పటికే ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మరింత బలపడింది. వికెట్లు కోల్పోతున్న, బెదిరిపోకుండా భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శనివారం కూడా ఇన్నింగ్స్‌ను కొనసాగించగలిగితే, భారత్ ఎదుట కొండంత లక్ష్యాన్ని ఉంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.