Page Loader
Womens T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో తొలి పోరుకు సిద్దమైన టీమిండియా ఉమెన్ .. 
ప్రపంచకప్‌లో తొలి పోరుకు సిద్దమైన టీమిండియా ఉమెన్

Womens T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో తొలి పోరుకు సిద్దమైన టీమిండియా ఉమెన్ .. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈసారి కప్పు కలను నెరవేర్చుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు,టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌కి సిద్ధమైంది. శుక్రవారం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు గ్రూప్-ఎ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది. గ్రూప్‌లోని అన్ని జట్లు బలంగా ఉన్నందున,భారత్‌కి ఎలాంటి మ్యాచ్‌ని తేలికగా తీసుకునే అవకాశం లేదు. టోర్నమెంట్‌లో విజయవంతమైన ఆరంభం చేయకపోతే సెమీఫైనల్ అవకాశాలు కష్టమవుతాయి. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియాను సెమీస్‌కు అడ్డుకోవడం కష్టమే,కాబట్టి రెండో స్థానం కోసం భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్‌ అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. అందువల్ల భారత్‌ మొదటి మ్యాచ్‌లో గెలవడం అత్యంత కీలకం.

వివరాలు 

జెమీమా రోడ్రిగ్స్ మంచి ఫామ్‌లో ఉండటం భారత జట్టు సానుకూలాంశం

ఇటీవల హర్మన్‌ప్రీత్ సేన మంచి ఫామ్‌లో ఉంది. వార్మప్ మ్యాచ్‌లలో రెండింటిలోనూ భారత్ విజయం సాధించింది. అయితే,బౌలర్లు రాణించినప్పటికీ,బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.టాప్‌-3 బ్యాటర్లు స్మృతి మంధాన,షెఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ ముఖ్యంగా రాణించాలి. జెమీమా రోడ్రిగ్స్ మంచి ఫామ్‌లో ఉండటం భారత జట్టు కోసం సానుకూలాంశం. మిడిలార్డర్లో బ్యాటింగ్‌లో రిచా ఘోష్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇన్నింగ్స్‌కు మెరుగైన ముగింపు ఇవ్వడంలో ఆమె సత్తా చాటాలి. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌లతో జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనను ఆశిస్తోంది.ఎందుకంటే వారు ఇద్దరూ బౌలింగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు. దుబాయ్ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలమని అంచనా వేసి, దీప్తి శర్మ, ఆశా శోభనా, రాధా యాదవ్‌ల ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించవచ్చు.

వివరాలు 

ఎక్కువ ఆల్‌రౌండర్లను ఉన్న న్యూజిలాండ్

న్యూజిలాండ్ జట్టు కూడా భారత్‌కు సమానంగా ఉంది, ముఖ్యంగా ఎక్కువ ఆల్‌రౌండర్లను కలిగి ఉండడం వారికి ప్రత్యేకత. ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్ అమేలియా కెర్‌ జట్టు ప్రధాన బలం. కెప్టెన్ సోఫీ డివైన్, లీ కాస్పరెక్, బ్రూక్ హాలిడేతో పాటు ఓపెనర్ సుజీ బేట్స్ కూడా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించగలవారు. వీరితో పాటు జెస్ కెర్, మోలీ పెన్‌ఫోల్డ్, ఫ్రాన్ జోనాస్‌ వంటి బౌలర్లతో కూడిన బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉంది. ముఖ్యంగా అమేలియా, సోఫీ, సుజీని నియంత్రించడం భారత్‌కు కీలకం. గత టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్ రికార్డు (4-9) పేలవమైనప్పటికీ, కివీస్‌ ఇటీవల టీ20లో మంచి ప్రదర్శన చేయలేదు.

వివరాలు 

తుది జట్లు (అంచనా)

భారత్‌: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, ఆశ శోభన, శ్రేయాంక పాటిల్, రాధ యాదవ్, రేణుక సింగ్‌. న్యూజిలాండ్‌: సుజీ బేట్స్, సోఫీ డివైన్, అమేలియా కెర్, బ్రూక్‌ హాలిడే, మ్యాడీ గ్రీన్, లీగ్‌ కాస్పరెక్, ఫ్రాన్‌ జోనాస్, జెస్‌ కెర్, మోలీ పెన్‌ఫోల్డ్, హన్నా రోవ్, లియా తహుహు. 13 న్యూజిలాండ్‌తో భారత్‌ ఆడిన టీ20లు. 4 మ్యాచ్‌లు నెగ్గి, 9 ఓడింది.