IND vs SA 4th T20I: నేడు లక్నోలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాల్గవ టీ20 మ్యాచ్.. మనోళ్లు సిరీస్ గెలుస్తారా..?
ఈ వార్తాకథనం ఏంటి
లక్నో వేదికగా ఇవాళ భారత్-దక్షిణాఫ్రికా మధ్య కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఖరారు చేసుకునే అవకాశం ఉంది. అయితే దక్షిణాఫ్రికాకు మాత్రం ఇది తప్పక గెలవాల్సిన పరిస్థితి. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు గత మ్యాచ్‌లో ఘన విజయంతో మంచి జోష్‌లో ఉంది. అదే సమయంలో జట్టులోని కొందరు కీలక ఆటగాళ్ల ఫామ్ మాత్రం ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ శుభమన్ గిల్ ప్రదర్శనపై చర్చ కొనసాగుతోంది.
వివరాలు
సిరీస్‌లో స్థిరమైన ఆట చూపించలేక తడబడుతున్న శుభ్‌మన్ గిల్
టీ20 ఫార్మాట్‌లో స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్ గత 21 ఇన్నింగ్స్‌లుగా అర్ధశతకం నమోదు చేయలేకపోయారు. మరోవైపు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ సిరీస్‌లో స్థిరమైన ఆట చూపించలేక తడబడుతున్నారు. బౌలింగ్ విభాగంలో మాత్రం వరుణ్ చక్రవర్తి తన స్పిన్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. పవర్‌ప్లే ఓవర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కీలక భాద్యతలు మోస్తున్నారు.
వివరాలు
టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు
ఇక సిరీస్‌లో వెనుకబడిన దక్షిణాఫ్రికా జట్టు ఆశలు నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఎయిడన్ మార్క్రమ్ నాయకత్వంలోని ఆ జట్టు నిలకడలేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడినప్పుడే భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగలుగుతారు. లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ ఆరంభంలో పేసర్లకు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉండగా, ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా వీక్షించవచ్చు.
వివరాలు
తుది జట్లు (అంచనా):
భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ (కీపర్), హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్. దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, ఎయిడన్ మార్‌క్రమ్ (సి), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, లుథో సిపామ్లా, లుంగీ ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.