Anthony Albanese : యాషెస్‌ను తలదన్నేలా భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ : ఆస్ట్రేలియా ప్రధాని
ఆసీస్ ప్రైమ్‌మినిస్టర్స్ XI వార్మప్ మ్యాచ్ సందర్భంగా క్రికెటర్లను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కలుసుకుని వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ పోరు గురించి ప్రస్తావించారు. రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఉత్కంఠభరితమైనవని ఆయన అన్నారు. యాషెస్ సిరీస్‌ను తలదన్నే స్థాయికి చేరుకున్న ఈ పోరు, ప్రేక్షకుల ఆసక్తిని మరింతగా పెంచిందని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడడం చాలా ప్రత్యేకమైందని, 1992 తర్వాత ఇదే మొదటిసారి జరుగుతోందని ఆల్బనీస్ తెలిపారు. ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా మెగా లీగ్‌గా మారిందని, క్రికెట్‌ను చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని చెప్పారు.
వార్మమ్ మ్యాచ్ కు వర్షం అంతరాయం
ఇటీవల నరేంద్ర మోదీతో కలిసి అహ్మదాబాద్‌లో మ్యాచ్ చూశానని, రెండు జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడ్డాయన్నారు. లండన్‌లో మేము గెలిచినా, సిరీస్‌లలో మాత్రం భారత్‌తో పోరు హోరాహోరీగా ఉంటుందన్నారు. డిసెంబర్ 26న జరిగే బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ కోసం కనీసం లక్ష మంది ప్రేక్షకులు వస్తారని ఆల్బనీస్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి పోటీలు ఆసీస్ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. కాన్‌బెర్రా వేదికగా జరగాల్సిన ప్రైమ్‌మినిస్టర్స్ XI వార్మప్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా టాస్ వేయడానికి సాధ్యపడలేదు.