Paris Paralympics2024: పారాలింపిక్స్‌లో రికార్డులను సృష్టిస్తున్న భారత అథ్లెట్లు
పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు రికార్డులను సృష్టిస్తున్నారు. మంగళవారం కూడా భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చూపించారు. తద్వారా భారత్ గత ఎడిషన్‌లో సాధించిన పతకాల సంఖ్యను అధిగమించింది. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలతో ముగిసిన భారత్, ఇప్పుడు 20 పతకాలు (3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్యాలు) సాధించింది. భారత పారా స్పోర్ట్స్ చరిత్రలో ఇదొక విశేష ఘట్టం. ఐకానిక్ స్టేడీ డి ఫ్రాన్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు అద్భుతంగా రాణించారు. ఆరో రోజు ముగిసే సమయానికి, ఇండియా మొత్తం ఐదు పతకాలు - రెండు రజతాలు, మూడు కాంస్యాలు - సాధించి, 17వ స్థానంలో నిలిచింది.
17వ స్థానంలో భారత్
భారత జావెలిన్ త్రోయర్లు అజీత్ సింగ్, ప్రపంచ రికార్డు హోల్డర్ సుందర్ సింగ్ గుర్జార్ ఎఫ్ 46 విభాగంలో వరుసగా రజతం, కాంస్యం సాధించారు. అజీత్ సింగ్ 65.62 మీటర్లతో, సుందర్ సింగ్ 64.96 మీటర్ల త్రోలుతో సత్తాచాటారు. హైజంపర్లు శరద్ కుమార్, టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు T63 ఫైనల్స్‌లో వరుసగా రజతం, కాంస్యం గెలుచుకున్నారు. శరద్ 1.88 మీటర్ల జంప్‌తో రజతం గెలుచుకోగా, మరియప్పన్ 1.85 మీటర్ల జంప్‌తో కాంస్యం సాధించాడు. భారతీయ షూటర్ అవనీ లేఖరా, మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ SH1 పోటీలో ఫైనల్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ విజయాలు భారత పారా అథ్లెట్లకు గర్వకారణంగా నిలిచాయి.