ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య అహ్మాదాబాద్ వేదికగా అక్టోబర్ 15వ తేదీన జరిగే మ్యాచ్ రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే అదే రోజు దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పండుగ సందర్భంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పెడితే సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గుజరాత్ మొత్తం గార్బా రాత్రులతో జరుపుకునే ముఖ్యమైన పండుగ ఇది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ తేదీని పున:పరిశీలించాలని అధికారులు బీసీసీఐకి సూచించినట్లు సమాచారం.
బీసీసీఐని హెచ్చరించిన భద్రతా సంస్థలు
నరేంద్ర మోదీ స్టేడియంలో మొత్తం ప్రేక్షకుల సామర్థ్యం లక్ష ఉంటుంది. ఆ వేదికలో నాలుగు మ్యాచులు జరగనున్నాయి. నవరాత్రి పండుగ కారణంగా పాకిస్థాన్- టీమిండియా మ్యాచ్ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐని హెచ్చరించాయి. తాజా సమాచారం ప్రకారం ఆ మ్యాచ్‌ను ఒక రోజు ముందే, అంటే అక్టోబర్ 14వ తేదీన నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై త్వరలో ఓ క్లారిటీ వస్తుందని ఓ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.