IND vs SA: సఫారీలో చేతిలో భారత్ ఘోర ఓటమి.. పరాజయానికి కారణాలు ఇవే!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. కేవలం 131 పరుగులకే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. విరాట్ కోహ్లీ(76) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ నిలదొక్కకోలేకపోయారు. దీంతో మూడోరోజునే భారత్ పరాజయం ఖరారైంది. రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా డకౌట్ అయ్యారు. జైస్వాల్ 5, శ్రేయాస్ 6, రాహుల్ 4, శార్దూల్ 2, సిరాజ్ 2 పరుగులకే వెనుతిరిగారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్ 4, జాన్ సెన్ 3, రబాడ 2 వికెట్లు తీశారు.
భారత ఓపెనర్లు విఫలం
ముఖ్యంగా భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌లో జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయారు. వీరి వైఫల్యం తర్వాత బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. అదే విధంగా భారత్ బౌలర్ల నుంచి సహకారం లభించలేదు. ముకేశ్ కుమార్ కాకుండా ప్రసిద్ధ కృష్ణను తీసుకోవడం టీమిండియా నష్టం చేసింది. మరోవైపు మహ్మద్ షమీ లోటు స్పష్టంగా కనిపించింది. ఇక వన్డే ప్రపంచ కప్ తర్వాత మైదానికి దూరంగా ఉన్న భారత ఆటగాళ్లు టెస్టుకు తగ్గట్టు బ్యాటింగ్ చేయలేకపోయారు. మిడిలార్డర్‌లో శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో విఫలమయ్యారు. రెండో టెస్టు మ్యాచ్ జనవరి 3న ప్రారంభం కానుంది.