IND vs SA: రెండో వన్డేలో కోహ్లీ-గైక్వాడ్ జోరు.. 358 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు రెండో మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారీగా 358 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22),రోహిత్ శర్మ (14) త్వరగానే పెవిలియన్ చేరడంతో ఆరంభంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. అయితే ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (105; 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (102; 93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించారు.
వివరాలు
మూడో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం
రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 12 ఫోర్లు,2 సిక్సులు)105 పరుగులు చేసి వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) 102 పరుగులు సాధించి సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 156 బంతుల్లో 195 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. అర్ధశతకం తర్వాత రుతురాజ్ ఆట మరింత దూకుడుగా మారింది. కేశవ్ మహారాజ్ వేసిన 28వ ఓవర్లో రెండు ఫోర్లు,ఒక సిక్స్ బాదగా,తరువాత బాష్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు కొట్టి శతకం దరిదాపుల్లోకి చేరాడు. కాసేపటికే సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ వెంటనే అవుటయ్యాడు.కోహ్లీ కూడా 90 బంతుల్లో శతకం సాధించిన కొద్దిసేపటికే పెవిలియన్‌కు చేరాడు.
వివరాలు
మార్కో యాన్సెన్ 2 వికెట్లు
తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ (1) రనౌటయ్యాడు. చివర్లలో కేఎల్ రాహుల్ మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో అజేయంగా 66 పరుగులు సాధించి కేవలం 33 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. రవీంద్ర జడేజా 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ 2 వికెట్లు పడగొట్టగా, నంద్రీ బర్గర్, లుంగి ఎంగిడి ఒక్కో వికెట్ తీసుకున్నారు.