
Akash Deep: డ్రీమ్ డెలివరీ అయ్యింది.. తాళాలు అందాయి: ఆకాశ్ దీప్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకాశ్ దీప్ (Akash Deep) అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌పై ఒక్క మ్యాచ్‌లోనే 10 వికెట్లు పడగొట్టిన అతడు, చివరి టెస్టులో నైట్‌వాచ్‌మన్‌గా బ్యాటింగ్ చేసి అర్ధ శతకం బాదాడు. ఇప్పుడు తన మరో కలను సాకారం చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ కల రక్షాబంధన్ రోజున నెరవేరడం విశేషం. కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి.
వివరాలు
''కంగ్రాట్స్ భాయ్'' అంటూ పోస్టులు
''డ్రీమ్ డెలివరీ పూర్తైంది. తాళాలు అందాయి. ఎంతో ముఖ్యమైన వారి సమక్షంలో నెరవేరడం మరింత ఆనందంగా ఉంది'' అని ఆకాశ్ దీప్ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. ఆకాశ్‌కు ముగ్గురు సోదరీమణులు ఉన్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 62 లక్షల విలువైన టయోటా ఫార్చునర్ టాప్ మోడల్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. అతడి పోస్టుపై భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, ''చాలా చాలా అభినందనలు'' అంటూ రిప్లై ఇచ్చాడు. భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కూడా శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ అభిమానులు ''కంగ్రాట్స్ భాయ్'' అంటూ పోస్టులు చేశారు.
వివరాలు
ఎక్కడా భయపడలేదు: బంగర్
ఐదో టెస్టులో అర్ధ శతకం చేసిన ఆకాశ్ దీప్ బ్యాటింగ్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ప్రశంసలు కురిపించాడు. ''నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి హాఫ్ సెంచరీ చేయడం గొప్ప విషయం. బెత్‌వెల్ బౌలింగ్‌ను ఆరంభంలో దూకుడుగా ఎదుర్కొన్న అతడు, తరువాత జాగ్రత్తగా షాట్లు ఆడాడు. నాణ్యమైన బ్యాటర్ మాదిరిగానే ఆడాడు. బ్యాటింగ్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించాడు. గతంలో బ్రిస్బేన్ టెస్టులో ఫాలో ఆన్ ముప్పు నుంచి జట్టును బయటపెట్టిన అనుభవం అతడికి ఉంది. ఇంగ్లాండ్‌పై కూడా షార్ట్ పిచ్ బంతులను భయపడకుండా, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు'' అని బంగర్ పేర్కొన్నాడు.