
2030 CWG: 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు భారత్ బిడ్ దాఖలు
ఈ వార్తాకథనం ఏంటి
ఒలింపిక్స్ తర్వాత అత్యధికంగా ఆదరణ పొందే, ఎక్కువ దేశాలు పాల్గొనే కామన్వెల్త్ క్రీడలకు (2030 CWG Sports) భారత్ ఆతిథ్యమివ్వడానికి సిద్ధమవుతోంది.
2030 కామన్వెల్త్ క్రీడలను గుజరాత్‌లో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం బిడ్ దాఖలు చేసినట్లు క్రీడాశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రీడల నిర్వహణకు ఆసక్తి వ్యక్తీకరణ గడువు మార్చి 31తో ముగియనుండగా, కొన్ని రోజుల క్రితమే భారత ఒలింపిక్ సంఘం (IOA) సంబంధిత లేఖను పంపించినట్లు సమాచారం.
వివరాలు
2010లో తొలిసారిగా కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం
భారతదేశం 2010లో తొలిసారిగా కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.
మరోసారి ఈ క్రీడలను నిర్వహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2030 పోటీల కోసం సీరియస్‌గా ప్రయత్నాలు సాగిస్తోంది.
అలాగే, 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి (IOC) ఇప్పటికే తన సిద్ధత్వాన్ని తెలియజేసింది.
ఈ నేపథ్యంలో, ముందు కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడం ఒలింపిక్స్‌కు సన్నాహకంగా ఉపయోగపడుతుందని భావిస్తూ, గుజరాత్‌లో ఆ క్రీడలను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతోంది.