World Cup final: నేడే టీమిండియా vs ఆస్ట్రేలియా ఫైనల్.. పిచ్ ఎవరికి అనుకూలం?
వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ నిర్ణయాత్మక పోరులో పిచ్ ఎవరికి అనుకూలంగా ఉంది? ఇక్కడ నమోదైన గణాంకాలను ఒకసారి పరిశీలిద్దాం. నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ మొత్తం 19 వన్డేలు ఆడింది. అందులో 11 గెలిచి 8 ఓడిపోయింది. ఇక్కడ ఆడిన చివరి 5 వన్డేల్లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఈ స్టేడియంలో 6 వన్డేలు ఆడింది. వాటిలో నాలుగు గెలిచింది. రెండు ఓడిపోయింది. ఈ మైదానంలో ఆసీస్ జట్టు టీమిండియాతో మొత్తం 3 వన్డేలు ఆడగా, అందులో 2 వన్డేల్లో ఓటమి చవిచూసింది.
టాస్ కీ రోల్ పోషిస్తుందా?
నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 30 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 15 మ్యాచ్‌లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. 15 మ్యాచ్‌లలో మొదట బౌలింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. దీన్ని బట్టి చూస్తే.. టాస్ కీ రోల్ పోషించకపోవచ్చు. ఈ మైదానంలో అత్యధిక స్కోరు దక్షిణాఫ్రికా (365/2, వర్సెస్ ఇండియా, 2010) చేసింది. అత్యల్ప జట్టు స్కోరు రికార్డు జింబాబ్వే (85 vs వెస్టిండీస్, 2006) పేరిట ఉంది. ఈ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరును డెవాన్ కాన్వే (152* vs ఇంగ్లాండ్, 2023) చేశాడు.
నల్ల నేల పిచ్‌పై ఫైనల్.. స్పిన్నర్లకు అనుకూలం
నరేంద్ర మోదీ స్టేడియంలో నలుపు, ఎరుపు నేలలు పిచ్‌లు వేర్వేరుగా ఉన్నాయి. నల్ల మట్టి పిచ్‌ల కంటే ఫాస్ట్ బౌలర్‌లకు ఎర్ర మట్టి పిచ్‌లు ఎక్కువ మద్దతునిస్తాయి. లీగ్ దశలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఉపయోగించిన నల్ల నేల పిచ్‌లోనే ఫైనల్‌ను నిర్వహించనున్నారు. నల్ల నేల పిచ్‌పై స్పిన్నర్లు విజృంభించే అవకాశం ఉంటుంది. అహ్మదాబాద్‌లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత పగటిపూట 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని, రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని అంచనా. ఫైనల్ మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం లేదు. మ్యాచ్‌లోని మొదటి బంతిని మధ్యాహ్నం 2 గంటల నుండి వేయాలి, కాబట్టి బౌలింగ్ జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో మంచు కారణంగా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
బ్యాట్స్‌మెన్, బౌలర్ల గణాంకాలు ఇలా..
ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. అతను 5 మ్యాచ్‌ల్లో 114.00సగటుతో 342పరుగులు చేశాడు. ప్రస్తుత భారత జట్టులో రోహిత్ శర్మ 7ఇన్నింగ్స్‌ల్లో 307పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 8ఇన్నింగ్స్‌ల్లో 108పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరఫున పాంటింగ్ 3ఇన్నింగ్స్‌ల్లో 61.67సగటుతో 185 పరుగులు చేశాడు. మార్నస్ లాబుషాగ్నే తన ఏకైక ఇన్నింగ్స్‌లో 71 పరుగులు చేశాడు. ఈ మైదానంలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు మాజీ దిగ్గజం కపిల్ దేవ్(10వికెట్లు) పేరిట ఉంది. మహ్మద్ సిరాజ్ ఇక్కడ ఆడిన 4మ్యాచ్‌ల్లో 7వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ జాన్సన్ ఇక్కడ ఆడిన 2మ్యాచ్‌ల్లో 4వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ జంపా 1 మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు.