India vs England, 2nd Test: బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో భారత్ రెండో టెస్టులో తలపడనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్ట్ లో సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు.ముఖేష్, కుల్దీప్ ఈ టెస్టులో చోటు దక్కించుకున్నారు.. రజత్ పాటిదార్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక,ఇంగ్లండ్ జట్టులో జాక్ లీచ్, మార్క్ వుడ్ స్థానంలో షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ వచ్చారు. తొలి టెస్టులో ఓడిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తుండగా.. మరోవైపు బజ్‌బాల్ ఆటతో సిరీస్‌లో శుభారంభం చేసిన ఇంగ్లండ్.. ఆధిక్యం పెంచుకోవాలని చూస్తోంది.
వేదిక, పిచ్ నివేదిక,స్ట్రీమింగ్ వివరాలు
విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు రెండోసారి తలపడనున్నాయి. ఈ గ్రౌండ్ బ్యాటింగ్‌కు అనుకూలం. అలాగని అట ప్రారంభంలో సీమర్లుకు అనుకూలిస్తుంది. Sports18 నెట్‌వర్క్ సిరీస్ ప్రసార హక్కులను కలిగి ఉండగా, JioCinema యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. భారత్, ఇంగ్లండ్ ఇప్పటి వరకు 132 టెస్టులు ఆడాయి. అందులో ఇంగ్లండ్ 51 మ్యాచ్‌లు గెలవగా, భారత్ 31 విజయాలు నమోదు చేసింది.50 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇంగ్లండ్ భారత్‌లో తమ చివరి రెండు టెస్ట్ సిరీస్‌లను కోల్పోయింది, అయితే 2012లో స్వదేశంలో భారత్‌ను ఇంగ్లండ్ ఓడించింది. ఓవరాల్‌గా భారత్‌లో జరిగిన 65 టెస్టుల్లో 15 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది
కీలక మైలురాళ్లు
జస్ప్రీత్ బుమ్రా 150 టెస్టు వికెట్లు సాధించడానికి నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఒకవేళ ఈ టెస్ట్ లో 4 వికెట్లు తీస్తే ఈ ఘనత సాధించిన 17వ భారత బౌలర్‌గా నిలుస్తాడు. రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు 96 టెస్టు మ్యాచుల్లో 496 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీయడానికి అవసరమైన వికెట్లు నాలుగు. అశ్విన్ ఈ వికెట్లు తీస్తే ఈ ఘనత సాధించిన రెండో టీమిండియా బౌలర్ గా, ఓవరాల్ గా తొమ్మిదో బౌలర్‌గా రికార్డు సృష్టించనున్నాడు.
జట్ల వివరాలు
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (సి), బెన్ ఫోక్స్ (WK), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్. భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (WK), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్