India vs South Africa: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా నాలుగో టీ20 రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. లఖ్‌నవూలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దట్టమైన పొగమంచు కారణంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. టాస్ కూడా వేయకుండానే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం నుంచి పలుమార్లు మైదాన పరిస్థితులను పరిశీలించిన అనంతరం, ఆటకు అనుకూల పరిస్థితులు లేవని నిర్ధారించిన అధికారులు చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
మాస్క్ ధరించి కనిపించినహార్దిక్ పాండ్య
కాలుష్యంతో కూడిన మంచు దట్టంగా ఏర్పడ్డ నేపథ్యంలో ఎకానా స్టేడియంలో ఏది సరిగా కనిపించకపోవడంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ను నిలిపివేశారు. బుధవారం లఖ్‌నవూలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాస్క్ ధరించి కనిపించడం గమనార్హం. ఇక ఇరు జట్లు ఐదో టీ20 మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌కు వెళ్లనున్నాయి. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. మిగిలిన చివరి మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ను భారత్ ఖాయం చేసుకుంటుంది.
వివరాలు
శీతాకాలంలో ఉత్తర భారతంలో మ్యాచ్‌లను ఏర్పాటు చేయడంపై విమర్శలు
నాలుగో టీ20 రద్దుతో బీసీసీఐ షెడ్యూలింగ్‌పై ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఉత్తర భారతంలో మ్యాచ్‌లను ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో లఖ్‌నవూ, చండీగఢ్, ధర్మశాల వంటి నగరాల్లో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటుందన్న విషయం తెలిసిందే. అధికారికంగా మ్యాచ్‌ను అధిక పొగమంచు కారణంగా రద్దు చేశామని ప్రకటించినా, అసలు సమస్య కాలుష్యంతో కూడిన మంచేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వివరాలు
న్యూజిలాండ్ సిరీస్ వేదికలను అటు ఇటు మార్చాలన్న సూచనలు
మ్యాచ్‌ల వేదికల కేటాయింపులో బీసీసీఐ సాధారణంగా రొటేషన్ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ వేదికలను, జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ సిరీస్ వేదికలను అటు ఇటు మార్చాలన్న సూచనలు కూడా వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లో వడోదర, రాజ్‌కోట్, ఇందౌర్, నాగ్‌పూర్, రాయ్‌పూర్, గువాహటి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా నిర్ణయించారు. ఇదిలా ఉండగా, గతవారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ ధర్మశాలలో పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో జరిగింది. ఆ మ్యాచ్ అనంతరం మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పందిస్తూ, "ఇంత చల్లదనం ఉన్న మైదానంలో నేను ఇంతకుముందెప్పుడూ ఆడలేదు. ఆ పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టంగా అనిపించింది" అని వ్యాఖ్యానించాడు.