కపిల్ వ్యాఖ్యలకు జడేజా కౌంటర్.. ఇక్కడ ఎవరికీ పొగరు లేదు, ఎప్పుడు ఏం చేయాలో మేనేజ్‌మెంట్‌కు తెలుసు
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ మధ్య ఆటగాళ్లపై విమర్శల పర్వం ఎక్కుపెట్టారు. తాజాగా కపిల్ చేసిన వ్యాఖ్యలపై భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందించారు. ఇక్కడ ఎవరికీ పొగరు లేదని,అవకాశాలు ఎవరికీ సునాయాసంగా రావని జడ్డూ అన్నారు. ఆటగాళ్లంతా వంద శాతం కష్టపడతారని చెప్పుకొచ్చాడు. జట్టు ఓడిపోయినప్పుడే ప్రదర్శనపై ప్రశ్నలు వస్తాయని జడేజా అన్నారు. అంతకుముందు కపిల్ దేవ్ ఆటగాళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారీగా డబ్బు వచ్చి పడుతున్న క్రమంలో ఆటగాళ్లలో అహం భావం పెరిగిందన్నారు. నేడు వెస్టిండీస్ భారత్ మధ్య చివరిదైన మూడో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గెలిచిన భారత జట్టు, రెండో వన్డేలో కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలోనే భారత ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు హోరెత్తాయి.
మెగా టోర్నీల్లో ప్రయోగాలు చేయలేం : జడ్డూ
ఆసియాకప్, 2023 ప్రపంచకప్‌కు ముందు తాము ఆడే చివరి వన్డే సిరీస్ వెస్టిండీస్ తోనేనని జడ్డూ అన్నారు. దీంట్లో భాగంగానే ఆటగాళ్ల ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా మెగా టోర్నీల్లో మార్పులు చేర్పులకు, ఆటగాళ్లను మార్చుతూ ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఉండదని చెప్పుకొచ్చారు. రెండో వన్డేలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు (సీనియర్లు) లేకుండానే బరిలోకి దిగామన్న జడ్డూ, మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా నష్టం ఉండదనే ఉద్దేశంతోనే మార్పులు చేశామన్నారు. ఏం చేయాలో కెప్టెన్‌కు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలుసని కితాబిచ్చారు. ఇక తనకూ ప్రతీ మ్యాచ్ ఆడాలని ఉంటుందని, జట్టు అవసరాలను బట్టి కొత్త వారిని తీసుకోవాల్సి వస్తుందన్నారు. మరో 6 వికెట్లు సాధిస్తే కపిల్‌దేవ్ సరసన జడేజా నిలవనుండటం విశేషం.