LOADING...
టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత
దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత

టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 31, 2023
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఆటగాళ్లపై మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు స్టార్ సీనియర్ ఆటగాళ్ల గాయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే వారి నిబద్ధతను ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ నిలదీశారు. ఇండియన్ క్రికెటర్లు తమకే అన్నీ తెలుసన్నట్లు భావిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరినీ సలహా అడగాలని కోరుకోరని చురకలు అంటించారు. కీలక ఆటగాళ్లు గాయాలపాలు కావడంతో రానున్న మెగా టోర్నీల్లో జట్టుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. చిన్న గాయాలైనా ఐపీఎల్‌లో ఆడేందుకు అభ్యంతరం చెప్పని ఆటగాళ్లు, జాతీయ జట్టుకు ఆడటంలో మాత్రం చిన్న గాయాలనే సాకులుగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం తరఫున ఆడమంటే విశ్రాంతి తీసుకునేందుకే ఇష్టపడుతున్నారని కపిల్‌ అన్నారు.

details

ఆటగాళ్ల పని భారం నిర్వహణపై బీసీసీఐ సరిగ్గా స్పందించట్లేదు : కపిల్ దేవ్

ఆటగాళ్లు విశ్రాంతి పేరుతో చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉంటున్నారని, ఇది సరైన దారేనా అంటూ కపిల్ ప్రశ్నించారు. గాయంతో ఏడాదిగా స్టార్‌ పేసర్‌ బుమ్రా జట్టుకు దూరమయ్యాడని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఆసియా కప్, ప్రపంచకప్‌ కోసం అతడు సిద్ధంగా లేకుంటే పరిస్థితి ఏంటన్నారు. మరోవైపు రిషభ్‌ పంత్‌ పైనా స్పందించారు. అతనో గొప్ప క్రికెటర్‌ అని, అతడు అందుబాటులో ఉండి ఉంటే టెస్ట్ క్రికెట్‌ మరింత బాగుండేదన్నారు. ఐపీఎల్‌ గొప్పదే, కాదనను కానీ అది మిమ్మల్ని(ఆటగాళ్లను) దెబ్బతీస్తోందని సున్నితంగా హెచ్చరించారు. ఆటగాళ్లకు ఐపీఎల్ లాంటి పరిస్థితులు టీమిండియాలో ఎదురైతే మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఆటగాళ్ల పని భారం నిర్వహణపై ఇటు బీసీసీఐ (BCCI) సైతం సరిగ్గా పనిచేయట్లేదన్నారు.

Advertisement