Asian Games: స్వర్ణం దక్కకపోయినా.. రజతాలతో మెరిసిన భారత అథ్లెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా క్రీడలు ప్రారంభమై తొమ్మిది రోజులు పూర్తవుతున్నా.. భారత్ ఖాతాలో ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలే ఉన్నాయి. అందులో మూడు స్వర్ణాలు ఖాయంగా వస్తాయని భావించిన కబడ్డీ, క్రికెట్ విభాగాల్లోనే లభించాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పలువురు భారత స్టార్ క్రీడాకారులు నిరాశపరుస్తుండగా.. మరికొందరు తుది వరకు పోరాడి రజత పతకాలతో సరిపెట్టుకుంటున్నారు. తొమ్మిదో రోజూ ఇదే పరిస్థితి కొనసాగింది. సోమవారం భారత్‌కు ఒక్క స్వర్ణ పతకం కూడా దక్కలేదు. నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. షూటింగ్‌లో ఇషా సింగ్, జావెలిన్ త్రోలో యశ్వీర్, లాంగ్‌జంప్‌లో మురళి శ్రీశంకర్, 1500 మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ రజత పతకాలు సాధించారు.
వివరాలు
అదరగొట్టిన ఇషా సింగ్.. షూటాఫ్‌లో రజతం
రోహిత్ జావెలిన్ త్రోలో, విద్య 400 మీటర్ల హర్డిల్స్‌లో, పారుల్ చౌదరి 5000 మీటర్ల పరుగులో, పింకి కురాష్‌లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించింది. తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ సోమవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా 38 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
క్వాలిఫికేషన్‌లో 580 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరిన ఇషా.. తుది పోరులో మాత్రం సత్తా చాటింది.
ఫైనల్లో నాలుగో సిరీస్ ముగిసిన తర్వాత 28 పాయింట్లతో స్వర్ణ పతక రేసులో నిలిచింది. అప్పటివరకు 26 పాయింట్లతో ఉన్న చైనా షూటర్ గ్జియావో జియారుగ్జువాన్ ఆ తర్వాత పుంజుకుంది.
వివరాలు
మరోసారి నిరాశపరిచిన మను బాకర్
ఇషాతో సమానంగా స్కోరు చేస్తూ వచ్చింది. ఆరో సిరీస్ ముగిసే సమయానికి జియారుగ్జువాన్ 35 పాయింట్లతో ముందంజలో ఉండగా.. ఇషా, ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సుక్ 34 పాయింట్లతో సమంగా నిలిచారు.
షూటాఫ్‌లో కిమ్ సుక్‌పై ఇషా పైచేయి సాధించింది. ఏడో సిరీస్ ముగిసే సరికి ఇషా, జియారుగ్జువాన్ చెరో 38 పాయింట్లతో సమంగా నిలవడంతో స్వర్ణ పతకం కోసం మరోసారి షూటాఫ్ అనివార్యమైంది.
అయితే షూటాఫ్‌లో ఇషా తడబడటంతో రజతంతో సరిపెట్టుకుంది.
ఆసియా క్రీడల్లో ఇషాకు ఇది మూడో పతకం. 21 ఏళ్ల ఇషా 2022 ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో రజత పతకాలు గెలుచుకుంది.
మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన మను బాకర్ మరోసారి నిరాశపరిచింది.
వివరాలు
25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో ఐదో స్థానం
10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రాణించలేకపోయిన మను.. 25 మీటర్ల పిస్టల్‌లోనూ సత్తా చాటలేకపోయింది.
క్వాలిఫికేషన్‌లో 579పాయింట్లు సాధించిన ఆమె 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూరమైంది. రహి సర్నోబత్ 568 పాయింట్లతో 30వ స్థానంలో నిలిచింది.
మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత్ 1732పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
అయితే 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్‌లో తన స్కోరును తప్పుగా నమోదు చేయడం వల్లే టీమ్ పతక అవకాశాలు దెబ్బతిన్నాయని రహి సర్నోబత్ ఆరోపించింది.
క్వాలిఫికేషన్ రెండో రోజు తొలి సిరీస్‌లో తాను కొట్టిన షాట్ టార్గెట్ మార్కుపై కాకుండా ఫ్రేమ్‌పై పడిందని చెబుతూ స్కోరు ఇవ్వలేదని ఆమె పేర్కొంది. దీంతో సర్నోబత్‌కు 100కి 86పాయింట్లు మాత్రమే వచ్చాయి.
వివరాలు
పతక రేసులో నీరూ దండా
మహిళల ట్రాప్ విభాగంలో నీరూ దండా పతక రేసులో నిలిచింది. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆమె 95 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
ఖతార్‌కు చెందిన బాసిల్ 94 పాయింట్లతో రెండో స్థానంలో, చైనాకు చెందిన సన్ యునాంగ్ 93 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
మంగళవారం జరిగే ఐదో రౌండ్ అనంతరం టాప్-8లో నిలిచే షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ట్రాప్ టీమ్ విభాగంలో నీరూ దండాతో పాటు మనీషా, ఆషిమా అహ్లావత్ పోటీలో ఉన్నారు.
ఇప్పటివరకు ఆసియా క్రీడల మహిళల ట్రాప్ విభాగంలో భారత్ తరఫున ఏ షూటర్ కూడా స్వర్ణ పతకం సాధించలేదు.
నీరూ ప్రస్తుత ప్రదర్శనను చూస్తే చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
గుల్వీర్ ఖాతాలో మరో రజతం
లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ మరోసారి అదరగొట్టాడు. ఈ ఆసియా క్రీడల్లో తన రెండో రజత పతకాన్ని సాధించాడు.
పురుషుల 1500 మీటర్ల పరుగులో 3:36.72 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో గుల్వీర్ రెండో స్థానంలో నిలిచాడు.
జపాన్‌కు చెందిన లిజావా 3:36.35 సెకన్లతో స్వర్ణ పతకం గెలుచుకోగా.. మరో జపాన్ రన్నర్ నగియా మోరి 3:37.92 సెకన్లతో కాంస్య పతకం సాధించాడు.
ఇదే ఈవెంట్‌లో మరో భారత రన్నర్ యూనస్ షా 3:43.88 సెకన్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
గుల్వీర్ సింగ్ 10 వేల మీటర్ల పరుగులోనూ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.
వివరాలు
వరుసగా రెండోసారి రజతం సాధించిన మురళి శ్రీశంకర్
లాంగ్‌జంపర్ మురళి శ్రీశంకర్ అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండో ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించాడు.
27 ఏళ్ల శ్రీశంకర్ సోమవారం అత్యుత్తమంగా 8.07 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. మురళి తన రెండో ప్రయత్నంలోనే 8.07 మీటర్ల ప్రదర్శన చేశాడు.
అయితే నాలుగో ప్రయత్నంలో చీలమండకు గాయం కావడంతో చివరి రెండు ప్రయత్నాలు చేయలేకపోయాడు.
దీంతో పక్కనుండి ప్రత్యర్థుల ప్రదర్శనను చూడాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ ఎవరూ అతణ్ని అధిగమించి రెండో స్థానాన్ని దక్కించుకోలేకపోయారు.
చైనాకు చెందిన యుహావో షి రెండో ప్రయత్నంలోనే 8.17 మీటర్లు దూకి స్వర్ణ పతకం సాధించాడు.
ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అన్వర్ అన్వరోవ్ 8.06 మీటర్ల ప్రదర్శనతో కాంస్య పతకం గెలుచుకున్నాడు.
వివరాలు
కంచు మోగించిన పారుల్ చౌదరి
మహిళల 5000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ పారుల్ చౌదరి 15:14.61 సెకన్లతో కాంస్య పతకం సాధించింది.
ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ సీమ 15:35.06 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఆసియా క్రీడల్లో పారుల్‌కు ఇది రెండో పతకం.
ఇంతకుముందు మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఆమె కాంస్య పతకం గెలుచుకుంది.
31 ఏళ్ల పారుల్.. గత ఆసియా క్రీడల్లో 5000 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించింది.
వివరాలు
నిరాశపరిచిన అవినాష్ సాబ్లె
గత ఆసియా క్రీడల్లో పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో స్వర్ణ పతకం సాధించిన అవినాష్ సాబ్లె ఈసారి నిరాశపరిచాడు.
ఈ సీజన్‌లోనే తన అత్యుత్తమ ప్రదర్శనగా 8:21.67 సెకన్ల సమయాన్ని నమోదు చేసినప్పటికీ.. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో సంతోష్ కుమార్ 49.95 సెకన్లతో ఏడో స్థానంలో నిలిచాడు.
మహిళల డిస్కస్‌త్రోలో సీమా కలిరమ్నా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనగా 59.88 మీటర్లు నమోదు చేసినప్పటికీ.. నిరాశ తప్పలేదు. ఆమె నాలుగో స్థానంతో పోటీని ముగించింది.