
IND vs PAK: ఈ విజయం పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు అంకితం: సూర్యకుమార్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాల్సిన డిమాండ్లు తెరపై వచ్చాయి. అయితే అన్ని వివాదాల మధ్యే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పాక్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్థాన్ జట్టు నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 15.5 ఓవర్లలోనే సులభంగా ఛేదించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సందర్భంగా, మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో భారత సారథి సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన వెంటనే సూర్యకుమార్ యాదవ్ ఈ విజయం పహల్గాం ఉగ్రదాడిలో బాధితుల కుటుంబాలు,భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు.
వివరాలు
భారత్ విజయంలో సూర్యకుమార్ కీలకం
సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, "'పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నాను. ఎంతో ధైర్యంతో దేశ సేవలో నిబద్ధత చూపించిన మన సైనికులకు ఈ విజయం అంకితం చేయాలనుకుంటున్నాం. వారి త్యాగాలు, సేవలు మనందరికీ స్ఫూర్తిగా ఉంటాయి. అవకాశం దొరికినప్పుడల్లా వారి ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం" అని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 47 పరుగులు చేసి భారత్ విజయానికి కీలకంగా నిలిచాడు.